కారడవిని కబళించేస్తోన్న కార్చిచ్చు.. లక్షలాది జంతువులు మృతి

కారడవిని కబళించేస్తోన్న కార్చిచ్చు.. లక్షలాది జంతువులు మృతి

fire

ఆస్ట్రేలియా కాలిపోతోంది. వేలాది హెక్టార్లు తగలబడుతున్నాయి. లక్షలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. వందలాది ఇళ్లు అగ్నికి అహుతవుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందుతున్నారు. ఈ ఘోరకలిని చూసి పర్యావరణవేత్తలు, జీవశాస్త్రజ్ఞులు, మానవతావాదులు తల్లడిల్లుతున్నారు.

గత ఏడాది బ్రెజిల్.. ఇప్పుడు ఆస్ట్రేలియా.. నాడు అమేజాన్ అగ్నికి ఆహుతైంది.. ఇప్పుడు ఆసీస్ బుష్‌ఫైర్... సందర్భమేదైనా, దేశమేదైనా కాలిపోతున్నది అడవే. మరణిస్తున్నది వనాల్లో నివసిస్తున్న మూగజీవాలే. గత ఏడాది ఆస్ట్రేలియాలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. అవి రోజురోజుకూ చెలరేగి అడవినంతటిని దహించివేయడం మొదలుపెట్టాయి. చూస్తుండగానే ఆ కార్చిచ్చు దావాన లమైపోయింది. మంటల సముద్రం అడవిని బుగ్గిపాలు చేసింది. అగ్నికీలల్లో చిక్కుకొని లక్షలాది జంతువులు మృత్యువాత పడ్డాయి.

గత ఏడాది సెప్టెంబర్ 23న కార్చిచ్చు ప్రారంభమైంది. అది అంతకంతకూ పెరిగి కారడవిని కబళించేస్తోంది. న్యూసౌత్ వేల్స్, విక్టోరియా, సౌత్ ఆస్ట్రేలియా, క్వీన్స్ లాండ్, పశ్చిమ ఆస్ట్రేలియా, టాస్మానియాలు మంటల్లో చిక్కుకున్నాయి. న్యూసౌత్‌వేల్స్‌లో 36 లక్షల హెక్టార్లలో అగ్నికీలలు అలుముకున్నాయి. విక్టోరియాలో 8 లక్షల హెక్టార్లు, దక్షిణ ఆస్ట్రేలియాలో లక్ష హెక్టార్లు, క్వీన్స్ లాండ్‌లో 2 లక్షల 50 వేల హెక్టార్లు, పశ్చిమ ఆస్ట్రేలియాలో 15 లక్షల హెక్టార్లు, టాస్మానియాలో 30 వేల హెక్టార్లలో మంటలు చెలరేగాయి. మొత్తంగా 63 లక్షల హెక్టార్ల అటవీప్రాంతం అగ్నికి ఆహుతైపోయింది.

న్యూ సౌత్‌వేల్స్, విక్టోరియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రెండు రాష్ట్రాలకు మంటలు వ్యాపించడంతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి వచ్చిన సందర్శకులు సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. కార్చిచ్చు ధాటికి వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. వివిధ ప్రాంతాల్లో 2 వేలకు పైగా ఇళ్లు కాలిపోయాయి. దావానలం కారణంగా 25 మందికి పైగా మృతి చెందారు.

మంటల ధాటికి పొరుగున న్యూజిలాండ్ దేశంలోని ఆకాశం ఎర్రగా మారిందంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయొచ్చు. నాలుగైదు నెలలుగా రగులుతున్న అగ్నిజ్వాలలు లక్షలాది వన్యప్రాణులను పొట్టనబెట్టుకుంది. అడవి తల్లినే నమ్ముకున్న మూగజీవాలు కీకారణ్యంలోనే ప్రాణాలు విడుస్తున్నాయి. ప్రఖ్యాత గాలపోగస్ దీవుల్లోని ప్రాణులు కూడా కార్చిచ్చు దెబ్బకి మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే వేలాది కోలస్, కంగారూలు మంటల వేడికి చనిపోయాయి. అరుదైన జీవజాతులు కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. కంగారూలు, కోలాలు, పాములు, మొసళ్లు, పక్షులు, ఇతర అడవి జంతువులు... ఇలా ఒక్కొక్కటిగా మంటల్లో పడి ప్రాణాలు కోల్పోయాయి. కొన్ని లక్షల వన్యజీవులు మంటల ధాటికి గాయపడ్డాయి.

Read MoreRead Less
Next Story