22 రోజులుగా అట్టుడుకిపోతోన్న అమరావతి.. కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం

22 రోజులుగా అట్టుడుకిపోతోన్న అమరావతి.. కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం

amaravati

ఒకటి కాదు.. రెండు కాదు.. 22 రోజులుగా అమరావతి అట్టుడుకిపోతోంది. 3 రాజధానులు వద్దు..అమరావతే ముద్దు అన్న నినాదం మార్మోగుతోంది..మందడం, తుళ్లూరుల్లో మహాధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇలా అన్నిచోట్ల రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

రాజధానిలో పలుచోట్ల పరిస్థితిలు ఉద్రిక్తంగా మారాయి. మందడంలో టెంట్ వేసుకునేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో.. రహదారిపైనే బైఠాయించి నిరసన తెలిపారు రైతులు.. ప్రభుత్వం కావాలనే తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలాసేపు ఎండలోనే ఉండడంతో సాంబశివరావు అనే రైతు సొమ్మసిల్లి పడిపోయాడు.

అమరావతి రైతుల ఆందోళనలకు అన్ని పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. జనసేన కూడా నేరుగా రైతుల నిరసనల్లో పాల్గొంటోంది. జనసేన విజయవాడ పశ్చిమ ఇంఛార్జ్‌ పోతిన మహేష్‌ ఆధ్వర్యంలో సామూహిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, జేఏసీ నేతలు పాల్గొన్నారు.. అమరావతి నుంచి రాజధానిని తరలించే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని మార్చడం కుదరదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఒక్క అవకాశం ఇస్తే స్వర్గం చూపిస్తానంటూ ప్రజలను నమ్మించిన జగన్.. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ నరకం చూపిస్తున్నారని విమర్శించారు.

విజయవాడ రూరల్‌ మండలం నిడమనూరు గ్రామంలో సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, సేవ్‌ అమరావతి అంటూ కోవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ప్రజలు. మహిళలు భారీగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. చిన్నలు, పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ.. రోడ్డుపైకి వచ్చి... సేవ్‌ అమరావతి నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో హైవేపై సుమారుగా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు ఎన్ని చేసినా ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. గత 22 రోజులుగా కుటుంబాలతో రోడ్డుపైనే ఉంటున్నా కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు. అటు మహిళలు కూడా భారీ సంఖ్యలో ఉద్యమంలో పాల్గొంటున్నారు. అరవైఏళ్ల వృద్ధులు మొదలు.. ఆరేళ్ల పిల్లల వరకూ అంతా కదం తొక్కి రాజధాని ఆకాంక్షను బలంగా చాటుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story