మారుమ్రోగుతున్న సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రా నినాదాలు
సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రా అంటూ రాజధాని ప్రాంతం మారుమోగుతోంది. రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 23వ రోజూ ఉధృతంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మెట్టు దిగకపోవడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరుతో ఉధ్యమాన్ని ఇంకాస్త ఉధృతం చేస్తున్నారు. ర్యాలీలు, మహా ధర్నాలు, దీక్షలతో హోరెత్తిస్తున్నారు. మొన్నటి వరకు కేవలం అమరావతిలో 29 ప్రాంతాలకే పరిమితమైన ఉద్యమం.. ఇప్పుడు ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. ఇతర ప్రాంతాలను ఉద్యమ సెగ తాకింది. కృష్ణా, గుంటూరు రెండు జిల్లాలోనూ నిరసనలు తీవ్రంగా కనిపిస్తున్నాయి.
ఓ వైపు రాజధాని ఉద్యమం తీవ్రత పెరగడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. అనుమతి లేకుండా దీక్షలు, ర్యాలీలు చేస్తే అరెస్టులకు వెనుకాడమనే సంకేతాలు పంపిస్తోంది. దీంతో పోలీసుల పహారాలోనే నిరసనలు, దీక్షలు కొనసాగిస్తున్నారు రాజధాని రైతులు. అరెస్టు చేసినా ఉద్యమాన్ని ఆపమంటున్నారు. మరోవైపు అమరావతి పరిరక్షణ సమితి భవిష్యత్తు కార్యచరణపై నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి ప్రతి రోజూ నిరసనలు మరింత ఉధృతం చేయాలని.. అన్ని ప్రాంతల వారిని కలుపుకుని వెళ్లాలని నిర్ణయించింది.
ఓ వైపు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమవుతుంటే.. మరోవైపు కొందరు రైతులు తీవ్ర మనో వేదనకు గురై మృత్యువాత పడుతున్నారు. గత 23 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నాప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్న రైతులు కొందరు గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో పాలేటి సుబ్బయ్య అనే రైతు మృతి చెందాడు. ప్రభుత్వం తీరుతోనే పది మందికిపైగా రైతులు మృతి చెందారని రాజధాని ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com