బామ్మగారు ఈ వయసులో కూడా.. ఆనంద్ మహీంద్రా ఫిదా..

బామ్మగారు ఈ వయసులో కూడా.. ఆనంద్ మహీంద్రా ఫిదా..

bamma-garu

తొంభైనాలుగేళ్ల బామ్మ ఇంట్లో ఉందంటే వంట గది వైపు తొంగైనా చూడదు. ఇంట్లో వాళ్లు టైమ్‌కి ఏదో ఒకటి పెడితే తిని ఓ మూల కూర్చుంటుంది. బామ్మతో కబుర్లు చెబుదామన్నా ఏమీ సరిగా వినిపించదు, కనిపించదు. కృష్ణా, రామ అంటూ కాలం వెళ్లదీస్తుంటుంది. ఎందుకు తల్లీ దేవుడు నన్నింకా తీసుకెళ్లకుండా ఉంచుతున్నాడు అని పలకరించిన వాళ్లందరికీ చెబుతుంటారు. అవును మరి చెయ్యడానికి ఏమీ చేతకాదు.. ఉన్నవాళ్లకి భారం తప్పించి అని బాధపడుతుంటారు.

కానీ చండీగఢ్‌కు చెందిన 94 ఏళ్ల బామ్మ అత్యంత వృద్ధ ఎంటర్ ప్రెన్యూర్‌గా తన జర్నీ ప్రారంభించింది. బామ్మగారికి ఖాళీగా కూర్చోవడం, ఒకరిపై ఆధారపడడం ఇష్టం లేదు. అందుకే ఓ ఆలోచన చేసింది. నాలుగేళ్ల క్రితం తనకు వచ్చిన స్వీట్లను తయారు చేసి విక్రయించడం ప్రారంభించింది. బేసిన్ కీ బర్ఫీ పేరుతో స్వీట్స్ తయారు చేస్తొంది. దీనికి మంచి స్పందన రావడంతో బామ్మగారు మరింత ఉత్సాహంగా స్వీట్స్ తయారు చేస్తున్నారు.

మధు టేక్ చందానీ అనే డాక్టర్ బామ్మగారి గురించి రాస్తూ ట్విట్టర్లో ఫోటోలు, వీడియోలతో సహా పోస్ట్ చేశారు. దాన్ని ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేయడంతో బామ్మగారిని, ఆమె పనితనాన్ని చూసి ఆయన అచ్చెరువొందారు. ఆమెను ఈ ఏడాది ఎంట్రప్రెన్యూర్‌గా పేర్కొన్నారు. స్టార్టప్‌లు అంటే మనకు సిలికాన్ వ్యాలీ, బెంగళూరులలో మిలియన్ డాలర్లు సంపాదించాలనుకునే మిలీనియల్స్ గుర్తొస్తారు. కానీ ఇప్పటినుంచి ఆ జాబితాలో 94 ఏళ్ల వృద్ధ మహిళను కూడా చేర్చుదాం అని చెప్పుకొచ్చారు. మహీంద్రాకు నచ్చిందంటే అందులో ఏదో విషయం ఉండే ఉంటుందని బామ్మ గారి గురించి నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. బామ్మ హర్భజన్ కౌర్ నేటి యువతకు స్ఫూర్తి దాయకం అని మహీంద్రా మెచ్చుకుంటున్నారు.

Next Story