అంకుల్.. నాన్నకావాలి.. తండ్రి అంత్యక్రియల్లో చిన్నారి

బయట ఎంత పని వత్తిడి ఉన్నా ఇంటికి రాగానే తన గారాల పట్టి నాన్నా అంటూ ఎదురు వస్తే పడిన కష్టమంతా హుష్ కాకి అయిపోతుంది. బజ్జోమ్మా చాలా టైమ్ అయింది అని అమ్మ అంటున్నా ఊహూ.. నాన్నవచ్చాకే పడుకుంటా.. నాన్నతో ఆడుకోవాలి.. నాన్నకో ముద్దివ్వాలి నేను.. అని అమ్మకి వచ్చీ రాని మాటలతో చెప్పే చిట్టి తల్లికి నాన్న ఇక తిరిగి రాడని తెలియదు. ఆస్ట్రేలియాలోని అడవుల్లో చెలరేగిన మంటలను అదుపు చేసే ప్రయత్నంలో అతడు మృతి చెందాడు.
ఫైర్ ఫైటర్ ఆండ్రూ ఓడ్వైర్ ఆస్ట్రేలియాలోని కార్చిచ్చును అదుపు చేసే క్రమంలో అతడిపై ఓ చెట్టు పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. అలా చనిపోయిన ఆండ్రూ అంత్యక్రియల్లో ఓ దృశ్యం అందరినీ కంట తడి పెట్టించింది. 36 ఏళ్ల ఆండ్రూకు 19 నెలల కుమార్తె ఉంది. చిట్టి తల్లికి తండ్రి ఇకలేడన్న విషయం తెలియదు. అతడి హెల్మెట్ పెట్టుకుని అటూ ఇటూ తిరిగింది. ఆ పాపను చూసి అధికారులు కళ్లనీళ్లు పెట్టుకున్నారు.
ఆండ్రూ వీరమరణానంతరం ఆ చిన్నారికి అధికారులు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని స్కాట్ మారిసన్ హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. అశ్రునయనాలతో ఆండ్రూకు నివాళులు అర్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com