సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే సంచలన వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ SA బోబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని జస్టిస్ బోబ్డే పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు పెరిగిపోతు న్నాయని జస్టిస్ బోబ్డే ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో శాంతి యుత వాతావరణం నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని రాజ్యాంగబద్దమని ప్రకటించడం తమ పని కాదని, చట్టంలోని చట్టబద్దతను పరిశీలించడమే తమ విధి అని జస్టిస్ బోబ్డే స్పష్టం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగబద్దంగా ఉందని ప్రకటించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ముంబైకి చెందిన పునీత్ కౌర్ దండా ఆ పిటిషన్ వేశారు. సీఏఏపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, ప్రజల్లో అపోహలు పెంచుతూ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. చట్టంపై అబద్దాలు చెబుతున్న ప్రతిపక్ష నాయకులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణను సీఏఏ రాజ్యాంగబద్దమే అని ప్రకటించాలని కోరారు. ఈ వాదనపై జస్టిస్ బోబ్డే తీవ్రంగా స్పందించారు. దేశం ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఈ సమయం లో ఇలాంటి పిటిషన్లతో ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు ఆగిపోతేనే పౌరసత్వ సవరణ చట్టంపై విచారణ జరుపుతామని చెప్పారు. ఇప్పటికే సీఏఏను సవాల్ చేస్తూ 60 పిటిషన్లు దాఖలయ్యాయని చీఫ్ జస్టిస్ గుర్తు చేశారు. ఆ పిటిషన్లపై జనవరి 22న విచారణ జరుగుతుందని చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com