నిర్భయ తల్లి సంచలన వ్యాఖ్యలు
నిర్భయ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ కుమార్ శర్మ, న్యాయపరంగా తనకున్న చివరి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఉరిశిక్షపై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశాడు. నలుగురు దోషులను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు ఉరి తీయాలంటూ ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఐతే, దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవడానికి 14 రోజులు సమయం ఇచ్చింది. ఈ క్రమంలో వినయ్ కుమార్, సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేశాడు.
ఇక, నిర్భయ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులకు క్షమాభిక్ష పెట్టే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. తన గుండె రాయిగా మారిపోయిందని చెప్పారు. నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ చేసిన సమయంలో ఓ దోషి తల్లి, నిర్భయ తల్లిని కలిసింది. తన బిడ్డ బతకడానికి సహకరించాలని, క్షమాభిక్ష పెట్టాలని కోరింది. ఈ విజ్ఞప్తిపై నిర్భయ తల్లి తీవ్రంగా స్పందించారు. తన కుమార్తె శరీరాన్ని రక్తంలో ముంచేశారని కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె శరీరంపై ఎన్ని గాయాలు ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. జంతువుల్లా ఆమెపై దాడి చేశారని, ఇప్పుడు వారి ఏడుపులు, శిక్షను తప్పించు కోవడానికి చేస్తున్న విజ్ఞప్తులు తనను మార్చలేవన్నారు. దోషులపై తనకు ఎలాంటి దయ, జాలి లేవని తేల్చి చెప్పారు. కూతురు పోయిన బాధ తనకు జీవితాంతం ఉంటుందని, ఐతే దోషులకు ఉరిశిక్ష పడితే అది దేశానికి-జాతికి ఓ మెసేజ్ పంపినట్లు అవుతుందన్నారు.
ఇక, దోషులకు మరణశిక్ష అమలు చేయడానికి తీహార్ జైలులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 3వ నెంబర్ సెల్‌లో ఉరితీతకు సంబంధించి 4 సొరంగాలు, 4 ఉరితాళ్లు సిద్దం చేశారు. అలాగే, ఉరి శిక్ష అమలుపై ట్రయల్స్ చేశారు. దోషుల బరువుతో సమానమైన వస్తువులను ఉరికంబానికి వేలాడతీసి ట్రయల్స్ నిర్వహించారు. మరణశిక్ష అమలుకు ముందు నలుగురు దోషులు తమ కుటుంబసభ్యుల ను కలవడానికి అనుమతిస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com