81.72 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి ద్వారా డబ్బు జమ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అమ్మ ఒడి పథకాన్ని చిత్తూరులోని పీవీకేఎన్ మైదానంలో సీఎం జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ల్యాప్‌టాప్ ద్వారా అమ్మ ఒడి పథకం లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులను బదిలీ చేశారు.
పేదరికం చదువుకు అడ్డుకాకూడదనే లక్ష్యంతోనే అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు. 81.72 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ప్రపంచంతో పోటీ పడి మన విద్యార్థులు చదువుకోవాలనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామన్నారు.
అమ్మఒడిలో భాగంగా ప్రభుత్వం వేసే డబ్బులు నేరుగా తల్లుల ఖాతాల్లోనే వేసేలా ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సంరక్షకుల ఖాతాల్లోకి అమ్మఒడి డబ్బులు వేస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివే అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఒకవేళ అర్హత పత్రాల సమర్పణలో ఇబ్బందుల వల్ల ఎవరైనా పథకానికి దూరమైనా.. సంబంధిత అధికారుల లేఖలు తీసుకొస్తే ఆ తల్లిని కూడా అమ్మఒడి లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com