రణరంగమైన రాజధాని.. యుద్ధభూమిని తలపించిన అమరావతి

రణరంగమైన రాజధాని.. యుద్ధభూమిని తలపించిన అమరావతి

police

రాజధాని రణరంగమైంది. అమరావతి యుద్ధభూమిని తలిపించింది. లాఠీలు విరిగాయి. రక్తంచిందింది. పోలీసుల అరాచకాలు పరాకాష్టకు చేరాయి..23 రోజులుగా శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని ఒక్కసారిగా హింసాత్మకంగా మార్చేశారు. 29 గ్రామాల్లోనూ దౌర్జన్యకాండ కొనసాగించారు. అమరావతికి కోసం ఉద్యమిస్తున్న మహిళలు, రైతులపై ఉక్కుపాదం మోపారు. ఉదయం నుంచే రాజధాని గ్రామాలను చుట్టుముట్టిన పోలీసులు..అత్యంత కర్కశంగా వ్యవహరించారు. లాఠీ ఛార్జ్‌లు, అరెస్టులతో ప్రశాంతమైన పల్లెల్లో అలజడి రేపారు. మహిళలు అని కూడా చూడకుండా చితక్కొట్టారు.

మందడం మండిపోయింది. తుళ్లూరు తల్లడిల్లింది. పెనుమాక, దొండపాడు, నిడమర్రు, నెక్కల్లు, ఐనవోలు ఇలా రాజధాని గ్రామాలన్నీ రణరంగమయ్యాయి. 23 రోజులుగా రాజధాని గ్రామాల్లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఉద్దండరాయుని పాలెం నుంచి విజయవాడ వరకు భారీ ర్యాలీ తలపెట్టారు మహిళలు. ఎలాగైనా ఈ ర్యాలీని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోపోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. అర్థరాత్రి నుంచే రాజధాని గ్రామాల్లో మోహరించి.. ప్రజలకు ఊపిరి ఆడకుండా చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తే చాలు అరెస్టులంటూ భయపెట్టారు. పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేసిన గ్రామస్తులు చాలా చోట్ల బయటకు వచ్చారు.

మందడం, తుళ్లూరు గ్రామాల్లో మహిళలు.. గ్రామదేవతలకు నైవేద్యం పెట్టడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడికి పూజలు చేయడానికి కూడా అనుమతి కావాలా అంటూ నిలదీశారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. కొందరు మహిళలలు స్పృహతప్పి పడిపోయారు. అయినా వెనక్కి తగ్గకుండా..పోలీసుల దమనకాండను ఎదురించారు రాజధాని మహిళలు. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లాఠీలకు పనిచెప్పారు పోలీసులు. ఇష్టారాజ్యంగా లాఠీలు ఝుళిపించారు. దొరికినవారిని దొరికినట్లుగా చితకబాదారు..పోలీసుల లాఠీఛార్జ్‌లో చాలా మంది మహిళలు గాయపడ్డారు. చేతులు, కాళ్లపై విచక్షణా రహితంగా లాఠీలతో బాదడంతో రక్తాలు కారాయి.

తుళ్లూరు, మందడంతోపాటు..అనేక గ్రామాల్లో పోలీసుల దౌర్జన్య కాండ కొనసాగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను ఎక్కడికక్కడ బలవంతంగా అరెస్టు చేశారు. పశువుల్లా లాక్కెళ్లి వ్యాన్లలో కుక్కేశారు.మహిళలు, ముసలి, రైతులు అన్న విచక్షణ లేకుండా

వ్యవహరించారు. ఇక యువకులనైతే అనేక చోట్ల చితకబాదారు. పోలీసుల బలవంతపు అరెస్టులపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా పోలీసు రాజ్యమా అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. గతంలో ఎన్నడూ ఇంతటి దారుణ పరిస్థితులు చూడలేదన్నారు.

లాఠీఛార్జ్ చేయడమే కాదు కొన్ని చోట్ల పోలీసులు అరాచకంగా వ్యవహరించారు.. విచక్షణ మరిచి ప్రవర్తించారు...రైతులను అదుపు చేసేందుకు కొందరు పోలీసులు ఇటుకలు, రాళ్లు పట్టుకొని వెళ్లడం స్పష్టంగా కనిపించింది. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లర్లను అదుపుచేయాల్సిన వాళ్లే..ఇలా రాక్షసంగా వ్యవహరిస్తే ఎలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమపై జరిగిన రాళ్లదాడి , లాఠీఛార్జ్‌ వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని రాజధాని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story