దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జె.ఎన్.యు.ఘటనలో మరో ట్విస్ట్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేఎన్‌యూలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ దాడికి మీరంటే మీరు బాధ్యులు అని అటు వామపక్ష విద్యార్థి సంఘాలు, ఇటు ఏబీవీపీ ఆరోపించుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. వర్సిటీ పరిధిలోని సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం దాడిలో పాల్గొన్న విద్యార్థుల ఫోటోలను విడుదల చేశారు. దీనిలో జేఎన్‌యూ విద్యార్థి నేత ఐషే ఘోష్‌తో పాటు మరో 9 మంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరంతా ఈనెల 5న వర్సిటీలోని పెరియర్ హాస్టల్‌పై దాడికి పాల్పడినట్లు సంచలన విషయాలు వెల్లడించారు ఢిల్లీ పోలీసులు.
ప్రస్తుతం సీసీ కెమెరా పుటేజీ అధారంగా విచారణ జరుపుతున్నామని.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు చెబుతున్నారు. దాడికి పాల్పడింది వారేనని విచారణలో రుజువైతే.. చట్ట ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అన్నారు. మరోవైపు పోలీసులు విడుదల చేసిన ఫొటోలపై ఐషే ఘోష్ స్పందించారు. ఇది వేరే వాళ్లు విడుదల చేసిన జాబితా అని కొట్టిపారేశారు. తాము తప్పు చేయలేదన్న ఐషే ఘోష్.. ఢిల్లీ పోలీసులు పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com