అమరావతి రైతులపై పోలీసుల లాఠీ ఛార్జ్
రాజధాని రణరంగంలా మారింది. ఎక్కడ చూసినా లాఠీఛార్జ్‌లు, అరెస్టులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఉదయం నుంచే ప్రతిచోటా పోలీసులు జులుం చూపించారు. ఆంక్షల పేరుతో ఇంటి నుంచి అడుగు కూడా బయటకు వెయ్యనివ్వకుండా రైతులు, మహిళల్ని కట్టడి చేశారు. చిన్న చిన్న అవసరాలకు బయటకు వెళ్లేందుకు కూడా అనుమతివ్వడం లేదు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై కూడా లాఠీలు ఝుళిపించారు. శుక్రవారం ఉదయం మందడం సహా కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి. రైతుల్ని ఎక్కడిక్కకడ ఆపేస్తూ అరెస్టులు చేశారు. మహిళల్ని కూడా విచక్షణా రహితంగా వ్యాన్‌లలో ఎక్కించారు. బలవంతంగా ఈడ్చుకెళ్తూ.. రెక్కలు విరిచేస్తూ అరాచకంగా ప్రవర్తించారు. ఈ స్థాయిలో ఆంక్షలు, దాడులు తాము జీవితంలో చూడలేదని.. తామేం తప్పు చేశారని ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని మహిళలు మండిపడుతున్నారు.
అసలు మహిళలపై దాడులు చేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు.. కవర్ చేస్తున్న మీడియాపై కూడా ఆంక్షలు ఎలా పెడతారు. ఈ ప్రశ్నలకు ఏ ఒక్కరి దగ్గరా సమాధానం లేదు. అమరావతిలోనే కాదు విజయవాడలో మహిళల ర్యాలీని కూడా పోలీసులు ఇలాగే అడ్డుకున్నారు. వందల మంది మహిళల్ని కర్కశంగా ఈడ్చుకుంటూ వెళ్లారు. ప్రశ్నించే వాళ్ల గొంతుల్ని నొక్కేయడం తప్ప ఎక్కడా సమాధానం అన్నదే లేదు. మీడియా ప్రతినిధులంతా ఈ అరాచకంపై విజయవాడ సీపీని కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com