రాజధాని తరలింపుపై రగిలిపోతోన్న రాష్ట్రం
రాజధాని తరలింపుపై రాష్ట్రం రగిలిపోతోంది. మూడు రాజధానులు కావాలని ఎవరు అడిగారంటూ నిలదీస్తూ అమరావతి కోసం నినదిస్తోంది. రాజధాని పేరుతో రాష్ట్రంలో దిగజారిపోతున్న పరిస్థితి చూస్తుంటే రక్తం మరిగిపోతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా ఒకటే నినాదం అని.. అదే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్నారు. అమరావతిని చంపేందుకు వైసీపీ చేయని ఆరోపణలు లేవన్నారు. రాజమహేంద్రవరంలో అమరావతి పరిరక్షణ యాత్రలో పాల్గొన్న చంద్రబాబు.. రాజధాని కోసం జోలె పట్టారు. చంద్రబాబు పిలుపుతో వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. రాజమహేంద్రవరం జనసంద్రంగా మారింది. రాజధాని కోసం ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.
అమరావతిని ప్రపంచం మొత్తం మాట్లాడేలా చేశామన్నారు చంద్రబాబు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. డబ్బులు లేవనే నెపం వేస్తూ రాజధాని తరలించే కుట్ర చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ నేతలకు విశాఖ మీద ప్రేమ లేదని.. అక్కడ ఉన్న భూముల మీదే ప్రేమ అన్నారు చంద్రబాబు.
హైదరాబాద్‌తో సమానంగా విశాఖను అభివృద్ధి చేశామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏ2 గత ఏడు నెలలుగా విశాఖలోనే ఉంటూ అక్కడి భూములపై కన్నేశారని ఆరోపించారు. అమరావతి ప్రజల పొట్ట కొట్టి తమ పొట్ట నింపుకోవాలని విశాఖ ప్రజలు కోరుకోరన్నారు.
ఒకే ఒక్క పిలుపుతో అమరావతి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు చంద్రబాబు. 33 వేల ఎకరాలు రైతులు ఇస్తే.. రియల్ ఎస్టేట్ అంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో కోటి రూపాయలు పలికే ఎకరా భూమిని.. 10 లక్షలు చేసిన పెద్దమనిషి జగన్ అన్నారు చంద్రబాబు.
ఓ విద్యార్థిని అమరావతి పరిరక్షణ సమితికి 15 గ్రాముల బంగారు చైన్ ఇచ్చి స్ఫూర్తిని చాటుకుంది. రాజధాని కోసం తన దగ్గరున్న గొలుసు ఇచ్చిన విద్యార్థినిని చంద్రబాబు అభినందించారు.
తొలుత మచిలిపట్నంలో జేఏసీ నిర్వహించిన సభలో పాల్గొన్న చంద్రబాబు..నిన్న రాజమహేంద్రవర్గం జేఏసీ బహిరంగసభలో పాల్గొన్నారు. నేడు తిరుపతిలో నిర్వహించనున్న రాజధాని పరిరక్షణ శాంతి ర్యాలీలో పాల్గొంటారు. జ్యోతిరావుపూలే విగ్రహం నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు ర్యాలీ జరుగనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com