తిరుపతిలో టెన్షన్.. మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి హౌస్ అరెస్ట్

ప్రజా సంఘాల ర్యాలీ నేపథ్యంలో తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ర్యాలీ కోసం శ్రీకాళహస్తి, సత్యవేడు, పీలేరు, చంద్రగిరి, మదనపల్లి, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో తిరుపతికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ అరెస్టులతో పోలీసులు వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తిరుపతి నగరంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఇక అమరావతి పరిరక్షణ ర్యాలీ జరగనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
అటు.. తిరుపతిలో 144 సెక్షన్ పెట్టినా.. ఎన్ని అరెస్టులు చేసినా ర్యాలీ నిర్వహించి తీరుతామన్నారు మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ JAC శనివారం తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనబోతున్నారు. అయితే.. పండుగ సీజన్ కావడంతో ర్యాలీకి అనుమతి ఇవ్వడం లేదన్నారు పోలీసులు. శాంతియుతంగా చేపడుతున్న ర్యాలీని అడ్డుకోవడం సరికాదంటున్నారు అమర్‌నాథ్ రెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com