అల వైకుంఠపురములో రివ్యూ

అల వైకుంఠపురములో రివ్యూ

review

టైటిల్ : అల వైకుంఠపురములో

తారాగణం : అల్లు అర్జున్, పూజాహెగ్డే, మురళీశర్మ, టబు, జయరాం, నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్, సునిల్ తదితరులు

ఎడిటింగ్ : నవీన్ నూలి

సంగీతం : తమన్

సినిమాటోగ్రఫీ : పి.ఎస్ వినోద్

నిర్మాతలు : అల్లు అరవింద్, సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు)

దర్శకత్వం : త్రివిక్రమ్

త్రివిక్రమ్ మాటలు ఎంత పంచింగ్ గా ఉంటాయో అందరికీ తెలుసు. ఆ మాటలతోనే మాయలు చేస్తూ ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేసుకున్నాడు. దర్శకుడుగా కంటే మాటల రచయితగానే ఎక్కువగా నచ్చుతాడు త్రివిక్రమ్. ఆ మాటల్లో కూడా ఎక్కువగా ఎథిక్స్ ను డిస్కస్ చేస్తుంటాడు. అందుకే అతను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతాడు. ముఖ్యంగా అతనికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. గత సినిమా ఈ వర్గాన్ని శాటిస్ ఫై చేయలేదు. దీంతో మరోసారి తనకు బాగా తెలిసిన, తన నుంచి ఎక్కువగా ఆశించి ఫ్యామిలీ డ్రామాతోనే వచ్చాడు. కథా పరంగా చూస్తే ఇది చాలా పాతది. కానీ దాన్ని నేటి కాలానికి అనుగుణంగా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది.

పురిటిలోనే సంపన్న కుటుంబం నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోకి మార్చబడ్డ బంటు(అర్జున్) కథ ఇది. ఆ మార్పు వెనక ఆ మిడిల్ క్లాస్ తండ్రి వాల్మీకి(మురళీ శర్మ) అక్కసు ఉంటుంది. తన కొడుకును ఆ ఇంటి బిడ్డగా, ఆ ఇంటి బిడ్డను తన బిడ్డగా పురిటిలోనే ఓ నర్సు సాయంతో మారుస్తాడు వాల్మీకి. అలా తను పనిచేసే ఏఆర్కే గ్రూప్స్ కంపెనీ వారి ఇంట్లో తన కన్నకొడుకును చూస్తూ మురిసిపోతూ.. తన ఇంట్లో ఉన్న ఆ ఇంటి బిడ్డను అనుక్షణం వేధిస్తుంటాడు. ఎంత మంచి పనిచేసినా ఎంకరేజ్ చేయకుండా ఇబ్బంది పెడుతుంటాడు. అయినా తండ్రిని ఏమీ అనలేక.. తనకు సంబంధించిన ఎన్ని అవకాశాలను తనకు కాకుండా చేసినా.. స్వయంగా ఓ ఉద్యోగం సంపాదించుకుంటాడు బంటు. ఆ ఉద్యోగంలో తన బాస్ అమూల్య(పూజా హెగ్డే)తో ప్రేమలో పడతాడు. ఇటు వైకుంఠపురములో పెరుగుతోన్న వాల్మీకి కొడుకుకి అమూల్యను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ తను బంటును ప్రేమిస్తోన్న విషయం చెప్పడానికి ఏఆర్ కే కంపెనీ ఓనర్ ఆఫీస్ కు వెళతారు. అప్పుడే ఆయనపై ఓ హత్యాప్రయత్నం జరుగుతుంది. ఆయన్ని ఆ ప్రమాదం నుంచి కాపాడిన బంటుకు అసలు విషయం తెలుస్తుంది. మరి ఆ తర్వాత బంటు తనే ఆ ఇంటి కొడుకును అని నిరూపించుకున్నాడా.. లేక త్యాగం చేశాడా..? అసలు ఏఆర్కే గ్రూప్ అధినేత రామచంద్ర(జయరామ్)పై హత్యాయత్నం ఎందుకు జరిగింది..? అనేది మిగతా కథ..

మామూలుగా త్రివిక్రమ్ సినిమాల్లో కథల కంటే కథనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ సారి కూడా అదే జరిగింది. బాగా తెలిసిన కథ. పైగా పాత ఫార్మాట్. ఆ ఫార్మాట్ లోనే ట్రెండ్ కు అనుగుణమైన కథనం రాసుకున్నాడు. తన పాత్రధారులకు కూడా మంచి పొజిషన్స్ ఇచ్చాడు. దీంతో 50స్ లోని ఈ ఫార్ముల కథకు నేటి యూత్ కూడా ఎట్రాక్ట్ అయిపోతారు. అలా జరగడానికి ఎంత ఛాన్స్ ఉంది అనే ఆలోచన రాకుండా.. ఆ జరిగిన విషయం ఆడియన్స్ కూ ముందే తెలిసేలా చేసినా.. కథనంతో కట్టిపడేశాడు త్రివిక్రమ్. ఇందుకోసం మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్.. అందులో ఆల్రెడీ సంపన్నుడే అని ఆడియన్స్ కు తెలిసిన హీరో ఇబ్బందులు పడుతుంటే వచ్చే సింపతీ కూడా ప్లస్ అయింది. ఒక్కో పాత్రను సినిమాకు కనెక్ట్ చేసిన విధానం బావుంది. ఫస్ట్ హాఫ్ కాస్త సాధారణంగా సాగినట్టు అనిపించినా.. సెకండ్ హాఫ్ లో స్పీడ్ పెంచాడు. హీరోయిజం చూపించేందుకంటూ ప్రత్యేకమైన సన్నివేశాలు రాసుకోకుండా సినిమాటిక్ గా అనిపించకుండానే తన హీరోను ఎలివేట్ చేశాడు త్రివిక్రమ్. అతని ఆలోచనను పూర్తిగా అర్థం చేసుకున్నవాడిలా.. చాలాకాలం తర్వాత మనకు అల్లు అర్జున్ కాక అతను చేసిన పాత్ర బంటుగా కనిపిస్తాడు. అంటే అతను అంత అద్భుంగా నటించాడు.

బంటు ఆ ఇంటి బిడ్డే అని ప్రేక్షకులకు, బంటు, వాల్మీకికి తప్ప అసలు వారికి తెలియడం అసాధ్యం. అందువల్ల ఇక హీరో త్యాగం చేస్తాడు అనుకున్నప్పుడు వచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. దీంతో ప్రేక్షకులు ఒకరకమైన శాటిస్ ఫ్యాక్షన్ పొందుతారు. ఇక ఈ క్రమంలో తాము సొంత కొడుకు అనుకుంటోన్న వ్యక్తి అసమర్థుడుగా ఉండటం హీరోయిజానికి ఛాన్స్ ఇచ్చినట్టుగా మారింది. ఆ పాత్రపై కూడా దర్శకుడు పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. మొత్తంగా పండగ టైమ్ లో తన నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమాను ఆశిస్తారో అలాంటి సినిమాతోనే వచ్చాడు త్రివిక్రమ్.

ఇక ఎప్పట్లానే ఆడవారి గొప్పదనాన్ని గురించి ఒక్క ముక్కలో చెప్పడం.. పేరెంట్స్ బిడ్డల కోసం ఎన్నో చేస్తారు.. కానీ బిడ్డలు కూడా తల్లిదండ్రుల కోసం త్యాగాలు చేస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని చెప్పే ప్రయత్నంలో వచ్చిన ఈ సినిమాలో త్రివిక్రమ్ కొన్ని చోట్ల తడబడ్డా ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే స్టఫ్ తో ఆకట్టుకున్నాడు.

ఆర్టిస్టుల్లో మేజర్ స్కోర్ అల్లు అర్జున్ దే. బంటు పాత్రల ఒదిగిపోయాడు. పూజాహెగ్డేదీ మంచి పాత్రే. బాగా చేసింది. అయితే మురళీ శర్మకు మరోసారి కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ పడింది. అద్భుతంగా చేశాడు. ఇతర పాత్రల్లో టబు రొటీన్ గానే అనిపించింది. జయరామ్ తనకు వచ్చిన మూడు మంచి సీన్స్ లో బెస్ట్ ఇచ్చాడు. సుశాంత్ సోసో అనిపించాడు. నివేదా పేతురాజ్ పాత్రకు ఏ ప్రాధాన్యం లేదు. విలన్ వీక్ గా ఉన్నా.. సముద్ర ఖని నటన బావుంది. నవదీప్, సునిల్, రాహుల్ రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ ఎప్పట్లానే పాత్రల పరిధిమేరకు చేసుకుంటూ పోయారు.

టెక్నికల్ గా ఈ సినిమాకు మొదట్నుంచీ సంగీతమే హైలెట్. సినిమాలో నేపథ్య సంగీతం కూడా అద్దిరిపోయింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా కనిపిస్తుంది. ఎడిటింగ్ దర్శకుడి టేస్ట్ మేరకు బావుంది. మాటలు హైలెట్. ఆర్ట్ వర్క్ బావుంది. ఫైట్స్ రియలిస్టిక్ అనిపిస్తాయి. ఇద్దరు అగ్రశ్రేణి నిర్మాతలు నిర్మించిన తర్వాత నిర్మాణ విలువల గురించి చెప్పేదేముందీ. త్రివిక్రమ్ మరోసారి తన ముద్రను చూపించినా.. హీరోయిన్ తొడలను చూసి హీరో ప్రేమలో పడ్డాడు.. తెలివి సంపన్నులకే సొంతం అనేలా ఉన్న సీన్స్ మాత్రం ఇబ్బంది పెడతాయి.

ఫైనల్ గా : పండగను వైకుంఠపురములో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు.

- బాబురావు.కె

Tags

Read MoreRead Less
Next Story