మహిళలపై పోలీసుల దాడులు.. జాతీయ మహిళా కమిషన్ సీరియస్
అమరావతిలో పోలీసుల దమనకాండ.. మహిళలపై లాఠీలతో విరుచుకుపడుతున్న తీరు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా దృష్టి సారించింది. కమిషన్ నుంచి ఇద్దరు సభ్యుల బృందం అమరావతి పర్యటనకు వచ్చింది. ప్రస్తుతం వాళ్లు గుంటూరులో ఉన్నారు. రాజధాని గ్రామాలకు వెళ్లి మహిళలతో మాట్లాడనున్నారు. నిజానికి శనివారమే వాళ్లు అమరావతికి రావాల్సి ఉన్నప్పటికీ... పర్యటన ఆదివారానికి వాయిదా పడింది. మహిళలపై పోలీసులు దాడులు చేయడాన్ని, లాఠీలు విరిగేలా కొట్టడాన్ని, కనీసం గుడికి కూడా వెళ్లకుండా అడ్డుకోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. కమిషన్‌కు చెందిన ఇద్దరు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ చేపట్టనున్నారు.
అమరావతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై.. పోలీసుల కఠిన వైఖరి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. శుక్రవారం పూట మహిళల్ని గుడికి కూడా వెళ్లనీయకుండా అడ్డుకోవడం... వాళ్లను అరెస్టు చేసి రాత్రిపూట కూడా పోలీస్ స్టేషన్‌లో ఉంచడం.. జాతీయ మహిళా కమిషన్ స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ట్వీట్ చేస్తే కానీ విడుదల చేయకపోవడంపై విచారణ చేపట్టనున్నారు. మరోవైపు.. మగ పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రాజధాని మహిళలు ఆరోపిస్తున్నారు. తాకరాని చోట తాకుతున్నారని, అసభ్యంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. శ్రీలక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడిన విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
జాతీయ మహిళా కమిషన్‌కు అమరావతి మహిళల నుంచి, ప్రజా సంఘాల నుంచి, JAC నుంచి, వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పోలీసులు కిరాతకంగా వ్యవహరిస్తున్నారంటూ వీడియోలు, ఫోటోలను సైతం జత చేశారు. ముఖ్యంగా మందడంలో మహిళలపై లాఠీలతో విరుచుకుపడడం.. బెజవాడలో మున్సిపల్ స్టేడియంలో నిర్బంధించడం తీవ్ర కలకలం రేపాయి. దీనిపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. వెంటనే నిజనిర్ధారణ బృందాన్ని పంపాలని కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. పోలీసులు మరింత రెచ్చిపోయారని.. మహిళ కమిషన్ టీమ్‌తో మాట్లాడవద్దంటూ వార్నింగ్ ఇచ్చారని కొందరు చెప్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com