రైతులు కష్టాల్లో ఉండడంతో.. సంక్రాంతి పండుగ చేసుకోవడం లేదు : భువనేశ్వరి
అమరావతికి భూములిచ్చిన రైతులు.. కష్టాల్లో ఉండడంతో.. తాము సంక్రాంతి పండుగ చేసుకోవడం లేదని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. అమరావతి పరిరక్షణ ర్యాలీలో పాల్గొనేందుకు చంద్రబాబు నర్సరావుపేట వెళ్లగా.. భువనేశ్వరి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెకు వెళ్లారు. సంప్రదాయం ప్రకారం అక్కడి నాగులపుట్టకు పూజలు చేశారామె. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. స్వర్గస్తులైన పెద్దలను స్మరించుకున్నారు.
అమరావతిలో మహిళలు, రైతులు చేస్తున్న ఉద్యమానికి హ్యాట్సాఫ్ అన్నారు నారా భువనేశ్వరి. ప్రభుత్వంపై నమ్మకంతో 33వేల ఎకరాలు ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందని నమ్మకం పెట్టుకున్నారని భువనేశ్వరి అన్నారు. అలాంటి రైతులు కష్టాల్లో ఉంటే.. సంక్రాంతి పండుగ చేసుకోవడానికి మనసు అంగీకరించడం లేదన్నారు. సంక్రాంతి ముందు గ్రామదేవతలకు పూజలు చేయడం ఆనవాయితీ అని.. అందుకోసమే నారావారి పల్లెకు వచ్చానని తెలిపారు. అమరావతి రాజధాని రైతులకు, మహిళలకు అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com