హస్తినకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్‌లో ఉన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శనివారం జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుండగా... మధ్యలోనే ఆయన హస్తినకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ ప్రముఖులతో సమావేశమయ్యేందుకు పవన్‌కు అపాయింట్‌మెంట్ ఖరారైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
రాజధాని రైతుల ఆందోళనలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అలా సమావేశం జరుగుతుండగానే.. ఢిల్లీ టూర్‌కి సంబంధించిన సమాచారం అందింది. దీంతో ఆయన హుటాహుటిన గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరారు.
అమరావతిలో రైతులతో శుక్రవారం సాయంత్రం సమావేశమైన పవన్ .. రాజధానికి సంబంధించిన అనిశ్చితిని కేంద్రమే తొలగించాలని డిమాండ్ చేశారు. శాసనసభలో రాజధానిపై తీర్మానం చేయడం కన్నా ముందే.. కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో చర్చించేందుకు పవన్ ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. పవన్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశం అవుతారని తెలుస్తోంది.
Tags
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com