మరో వివాదంలో చిక్కుకున్న పృథ్వీరాజ్‌

మరో వివాదంలో చిక్కుకున్న పృథ్వీరాజ్‌

prudvi

SVBC చైర్మన్‌, కమెడియన్‌ పృథ్వీరాజ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతుల్ని పెయిడ్‌ ఆర్టిస్టులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్‌.. తాజాగా తన వద్ద పనిచేస్తున్న మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో టేప్‌ బయటకొచ్చింది. 36 మంది ఉద్యోగులను ఇష్టానుసారంగా నియమించుకుని, డబ్బులు వసూలు చేశారని ఆయనపై గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి వరకు వెళ్లడంతో.. పృథ్వీని మందలించారు. ఇప్పుడు ఓ ఉద్యోగిని పట్ల అసభ్యంగా మాట్లాడి మరో వివాదంలో చిక్కుకున్నారు.

SVBC చైర్మన్‌గా పృథ్వీరాజ్‌ నియామకమే వివాదాస్పదం. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారు. SVBC ఛైర్మన్‌గా ఆయనకు అర్హతలేంటని ప్రశ్నించారు. ఆయనకు ముందు.. సుప్రసిద్ధ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు SVBC చైర్మన్‌గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో.. రాఘవేంద్ర రావును తొలగించి.. కమేడియన్‌ పృథ్వీరాజ్‌ను చైర్మన్‌ను చేశారు.

పృథ్వీరాజ్ SVBC చైర్మన్‌ పదవికి ఎలా అర్హుడన్న దానిపై చాలా విమర్శలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైసీపీలో చేరారు పృథ్వీరాజ్‌. అప్పటి వరకు సినిమాల్లో కమేడియన్‌ వేషాలేస్తూ.. పాపులర్‌గా ఉన్న పృథ్వీ వైసీపీలో చేరాక వాయిస్‌ పెంచారు. మైక్‌ కనిపిస్తే... వైసీపీకి ప్రచారం చేస్తూ.. టీడీపీపై విమర్శలు గుప్పిస్తూ.. వచ్చారు. కొన్ని టీవీ ఛానెల్స్‌ డిబేట్స్‌లోనూ.. తనదైన శైలిలో చర్చల్లో పాల్గొని.. వైసీపీ అధినాయకత్వాన్ని మెప్పించేందుకు ప్రయత్నించారు.

ఎన్నికల సీజన్‌లో సినిమాలు పక్కనబెట్టి.. వైసీపీ ప్రచారానికి నిమగ్నమయ్యారు పృథ్వి. ఫలితాల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. పృథ్వీరాజ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. ప్రచారంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన సీఎం జగన్‌.. ఏకంగా SVBC చైర్మన్‌ పోస్టు కట్టబెట్టారు. ఇక చైర్మన్‌ అయ్యాక..రకరకాల భక్తి వేషాలతో.. ఆ ఛానెల్‌లో కార్యక్రమాలు నిర్వహించారు పృథ్వీరాజ్‌. దానిపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి.

డబ్బులు తీసుకోని ఇష్టమొచ్చినట్టు ఉద్యోగులను తీసుకున్న వ్యవహారం పృథ్వీకి బెడిసి కొట్టింది. ఆయన చేపట్టిన నియామకాలను టీడీపీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి రద్దు చేశారు. ఇలా ఉండగా.. రాజధాని రైతులపైనా.. పృథ్వీ చేసిన పెయిడ్‌ ఆర్టిస్ట్‌ కామెంట్స్‌ వివాదాస్పద మయ్యాయి. వైసీపీ మద్దతుదారుల నుంచీ వ్యతిరేకత వచ్చింది. ఈ ఘటనపై సీఎం జగన్‌.. పృథ్వీని తీవ్రంగా మందలించినట్టు సమాచారం.

ఓ మహిళా ఉద్యోగితో పృథ్వీరాజ్‌ జరిపిన రోమాంటిక్‌ చిట్‌ చాట్‌ తాజాగా వివాదమైంది. పృథ్వీ తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. కనీస నైతిక విలువలు లేని వ్యక్తికి SVBC చైర్మన్‌గా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వ్యక్తిని తొలగించాలని ఉద్యోగా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రథ్వీతీరుపై మహిళా సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి. పృథ్వీరాజ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Next Story