అమరావతిలో పరిస్థితులను నడ్డాకు వివరించిన పవన్

ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. అమరావతిలో జరుగుతున్న పరిణామాలతో పాటు కాకినాడలో జనసేన కార్యకర్తలపై జరిగిన దాడి అంశాలను పవన్ నడ్డాకు వివరించినట్లు తెలుస్తోంది.
ఏపీలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కలిసి పనిచేయాలని జనసేన, బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి జరిగే కార్యక్రమాలన్నీ ఉమ్మడిగా చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్లు సమాచారం.
జేపీ నడ్డాకు దేవుని ప్రతిమను అందజేశారు పవన్. ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అదే సమయంలో.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఎంపీ తేజస్వి సూర్య కూడా నడ్డా నివాసంలో ఉన్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన అనంతరం రాష్ట్రంలో నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలను పవన్ వివరించినట్లు సమాచారం. అమరావతిలో ఏం జరుగుతుందో తనకూ తెలుసని.. ఏపీ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నానని నడ్డా అన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే ఇకపై రెండు పార్టీలు కలిసి పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై త్వరలోనే ఇరు పార్టీలు పూర్తిస్థాయి ప్రకటన విడుదల చేసే అవకాశముంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com