తుళ్లూరులో తీవ్రమైన పోలీసుల దమనకాండ
రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తోన్న ఆందోళన 27వ రోజుకు చేరుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై మూడ్రోజులుగా దౌర్జన్యకాండ సాగిస్తున్నారు పోలీసులు. అరెస్టులు, లాఠీఛార్జ్‌తో బెంబేలెత్తిస్తున్నారు. అయినా ప్రజలు లెక్కచేయడం లేదు. 144 సెక్షన్‌ను కూడా లెక్కచేయకుండా తుళ్లూరు మహాధర్నాలు, మందడంలో కవాతులతో తమ నిరసన గళాలని బలంగా వినిపిస్తున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనే ఏకైక డిమాండ్‌తో నినదిస్తున్నారు. కానీ జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని.. పైగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
29 గ్రామాల్లో వేలాది మంది పోలీసుల్ని మోహరించారు.. తుళ్లూరులో పోలీసుల దమనకాండ తీవ్రమైంది. కనీసం ప్రజలను ఇళ్లలోంచి బయటకు కూడా రానివ్వడం లేదు. చంటిబిడ్డను కూడా బయటకు తీసుకెళ్లకుండా ఆంక్షలు విధించారు. మహిళలపై మగ పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. చిన్నపిల్లాడిని కూడా అదుపులో తీసుకున్నారు పోలీసులు.
మరోవైపు విజయవాడలో ధర్నా చేసిన మూడువేల మంది మహిళలపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. సెక్షన్ 353, 143, 147, 188, 290, సెక్షన్ 32 కింద కేసులు నమోదు చేశారు. మహిళలపై నమోదైన కేసులపై పాస్‌పోర్ట్ కార్యాలయానికి నివేదిక పంపారు పోలీసులు. పాస్‌పోర్టులు రద్దు అవుతాయని మహిళల్ని బెదిరిస్తున్నారు పోలీసులు
అటు రైతులు చేపడుతున్న నిరసనలను టీవీల్లో చూపించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. ప్రజల బాధను ప్రపంచానికి చూపుతున్న టీవీ5పై కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. రాజధాని గ్రామాల నుంచి వెళ్లిపోవాలంటూ హుకూం జారీ చేశారు.
మందడంలో రైతులు ఆందోళన చేస్తున్న టెంట్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. మహిళలు మైక్‌లో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఫోటోలు తీశాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. అతన్ని చుట్టుముట్టారు. ఇంటలిజెన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చానని చెప్పడంతో.. ఐడీ కార్డు చూపించాలని నిలదీశారు. చివరికి పోలీసు అధికారులు వచ్చి అతడు ఇంటలిజెన్స్ నుంచి వచ్చారని నిర్ధారించడంతో అతన్ని వదిలిపెట్టారు రైతులు.
మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా లాఠీలు ఝుళిపించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..రాజధాని గ్రామాల్లో పోలీసుల దమనకాండ ఇప్పటికే జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com