సామూహిక నిరాహార దీక్షలకు సిద్ధమవుతున్న అమరావతి రైతులు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కోసం ఉద్యమాన్ని ఆ ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. 28 రోజులుగా ఆందోళనలు, నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో బుధవారం నుంచి తుళ్లూరు, మందడం, వెలగపూడి, కిష్టాయపాలెం గ్రామాల్లో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు రైతులు తెలిపారు.
తుళ్లూరులో రైతులు, మహిళలు చేపట్టిన దీక్షకు టీడీపీ నేతలు వంగవీటి రాధా, నందమూరి సుహాసిని సంఘీభావం తెలిపారు. ఏ జిల్లాలోనైతే వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లా ప్రజలను, రైతులను వెన్నుపోటు పొడిచారని విమర్శలు గుప్పించారు. మహిళలపై దాడులు చేయడం రాజన్న రాజ్యమా అని రాధా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని.. మార్చడం ఎవరితరం కాదని సుహాసిని అన్నారు.
అమరావతి పరిరక్షణ సమితి ఏపీ రాజధాని కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసింది. గుంటూరు జిల్లాలో ఈనెల 20న జైల్ భరో చేపట్టనుంది. ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్లు ఇవ్వడం ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు.
రాజధాని గ్రామాల్లో ఎక్కడా సంక్రాంతి శోభ కనిపించలేదు. పండుగ పూట అందమైన రంగవల్లులు, పూలమాలల అలంకరణలతో కళకళలాడాల్సిన ఇళ్లు చిన్నబోయాయి. అధికార వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా.. రైతులు పండగకు దూరంగా వున్నారు. వెలగపూడిలో రిలే దీక్షల వద్ద ముగ్గులు వేసి మహిళలు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం ఆగదన్నారు. మందడంలోను ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ముగ్గులు వేశారు.
అటు గుంటూరులో అమరావతి కోసం మహిళా జేఎసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. మానవహారం నిర్వహించారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాన్ పొలిటికల్ మహిళా జేఏసీ స్పష్టం చేసింది. బుధవారం ముగ్గులతో నిరసన తెలుపుతామని, చనిపోయిన రైతుల ఫొటోలతో 16న ఆందోళనలు చేస్తామని, 17న విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com