అమరావతి అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ప్రోఫెసర్ జీవీఆర్ శాస్త్రి
ఏపీలో గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి. కేంద్ర హోంశాఖ సెక్రటరీతో సమావేశం అయిన ఆయన ఏపీ ప్రభుత్వ తీరుతో పాటు.. పోలీసుల అరాచకాలను వివరించి.. ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని కోరారు.
28 రోజులుగా అమరావతి అట్టుడుకుతోంది. 3 రాజధానుల ప్రతిపాదను వ్యతిరేకిస్తూ ఉద్యమజ్వాల ప్రజ్వరిల్లుతోంది. న్యాయం కోసం 29 గ్రామాలు ప్రజలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాష్ట్రమంతా వీరికి మద్దతుగా నిలుస్తోంది. అటు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాజధాని రైతులపై పోలీసులు సాగించిన దమనకాండ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు అన్నతేడా లేకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. నిర్దయగా లాఠీఛార్జ్ చేసి.. అన్నదాతల రక్తం కళ్ల జూశారు. కొందరు మహిళలకు చేతులు విరిగాయి. ఇక శ్రీలక్ష్మి ఉదంతం అత్యంత హేయం. ఖాకీల కావరానికి పరాకాష్టగా నిలిచింది ఈ ఘటన. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జాతీయ మహిళా కమిషన్, నేషనల్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా అమరావతిలో పర్యటించారు. పోలీసుల దౌర్జన్యకాండను నిరసిస్తూ.. రాష్ట్రమంతటా నిరసనలు వెల్లువెత్తాయి.
పోలీసుల దమనకాండపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అమరావతిలో ఏం జరుగుతోందని నిలదీసింది. 144 సెక్షన్ విధించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ప్రజలను శాంతియుత నిరసనలకు అనుమతించాలని ఆదేశించింది. ఈ అంశాలన్నింటినీ.. కేంద్ర కేంద్ర హోంశాఖ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com