ఖబడ్దార్ అంటున్న పోలీసులు.. పందానికి 'సై' అంటున్న పందెం రాయుళ్లు

ఖబడ్దార్ అంటున్న పోలీసులు.. పందానికి సై అంటున్న పందెం రాయుళ్లు

KODI

పోలీసులు ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నా.. గోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలు జోరుగా మొదలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని పొడగట్లపల్లి, దేవరపల్లి, కొత్తపేట, ర్యాలీ, తాడిపూడి, వెలిచేరు, రాజవరంలో కోడి పందాలు ప్రారంభమయ్యాయి. అధికార, ప్రతిపక్ష నాయకుల సమన్వయంతో పందాలు జరుగుతున్నాయి. కోడి పందాలు నిర్వహించరాదని.. గత 15 రోజులుగా పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా.. పందెంరాయుళ్లు పట్టించుకోలేదు.

కాకినాడ రూరల్‌లోనూ కోడిపందాలు ప్రారంభమయ్యాయి. లక్షల్లో పందెం కట్టి.. పుంజుల ఫైట్‌ చూసేందుకు పందెరాయుళ్లు బారులు తీరుతున్నారు. వీటిని చూడటానికి పెద్ద ఎత్తున ఔత్సాహికులు కూడా తరలివస్తున్నారు.

ఏలూరు మండలం జాలిపూడి పందాల బరులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పందెం రాయుళ్లకు అధికారులకు మధ్య వాగ్వాదం- తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు కేసులు పెట్టడానికి రెడీ అయ్యారు.

కోడి పందాలు లేకుండా గోదావరి జిల్లాల్లో సంక్రాంతిని ఊహించుకోలేం. ప్రెస్టీజ్‌ మేటర్ కావడంతో.. పందెం రాయుళ్లు లక్షలు పెట్టి కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో మొదలైన పుంజుల యుద్ధంలో పందెం కాయడానికి పెద్ద ఎత్తున ఔత్సాహికులు తరలివచ్చారు.

కోడి పందాల్లో పాల్గొందామని వచ్చినవారి ఉత్సాహాన్ని కృష్ణా జిల్లా పోలీసులు నిరుగార్చారు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడులో కోడిపందాలకు పర్మిషన్‌ లేదని బరులు వద్ద ఉన్నవారిని పోలీసులు తరిమివేశారు. దీంతో కొందరు నిర్వాహకులు అక్కడి నుంచి పరారయ్యారు. పందాలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story