సంతోషంతో జరుపుకోవాల్సిన సంక్రాంతి.. ఈ సారి కష్టాల మధ్య జరుగుతోంది : చంద్రబాబు

సంతోషంతో జరుపుకోవాల్సిన సంక్రాంతి.. ఈ సారి కష్టాల మధ్య జరుగుతోంది : చంద్రబాబు

babu

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించి.. జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికలను అందులో వేసి తగులబెట్టారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

తెలుగు ప్రజలు సంతోషంతో జరుపుకోవాల్సిన సంక్రాంతి... ఈ సారి కష్టాల మధ్య జరుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లోని తెలుగువారు సైతం అమరావతిపై ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం నియమించిన జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికలు చెత్త కాబట్టే భోగి మంటల్లో వేసి కాల్చామని తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా అందరూ రాజధానిపై ఆలోచించాలని.. ప్రతి ఒక్కరు అమరావతికి మద్దతు పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అవాస్తవాలను చెబుతోందని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికే అక్కడ పరిపాలనకు కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. విశాఖ నగరం ఇప్పటికే అభివృద్ధి చెందిందని.. రాజధాని తరలింపుతో ప్రత్యేకంగా ఒనగూరేది ఏమీ లేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి తప్ప.. రాజధానిని తరలించడంతో సమస్యలు పరిష్కారం కావని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు.

అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న చైతన్య యాత్రలకు విశేష స్పందన వస్తోందని.. ప్రతి ఒక్కరు రాజధాని కోసం సాయం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. అమరావతి ఉద్యమ స్పూర్తి ప్రతి ఒక్కరిలోనూ నిండాలని పిలుపునిచ్చారు. జై అమరావతి అన్న పదాన్ని అలవాటుగా మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story