తమకు రాజధాని కావాలని విశాఖ ప్రజలు అడగలేదు: చంద్రబాబు

తమకు రాజధాని కావాలని విశాఖ ప్రజలు అడగలేదు: చంద్రబాబు

AMARAVATI

రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు. మందడంలోని రైతు శిబిరానికి చేరుకుని వారికి మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణితో పాటు పలువురు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగకు దూరంగా ఉన్న చంద్రబాబు కుటుంబ సభ్యులు.. రాజధాని రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.

తమకు రాజధాని కావాలని విశాఖ ప్రజలు అడగలేదన్నారు చంద్రబాబు. అమరావతికి అన్యాయం చేసి తమకు న్యాయం చేయాలని విశాఖ ప్రజలు ఎన్నడూ కోరుకోరన్నారు. ప్రజలను బాధపెట్టి.. సీఎం జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు చంద్రబాబు.

రాష్ట్రం విడిపోయినప్పడు కూడా ప్రజలు ఇంత బాధపడలేదన్నారు చంద్రబాబు. భూములు ఇచ్చిన పాపానికి రైతులు పోరాటం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్ల లాంటివని.. అందులో అమరావతిని చంపేసి ఓ కన్ను పోగొట్టారని విమర్శించారు.

రైతులు ఇంత ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్‌ ఎడ్ల పందాలకు ఎలా వెళ్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఎడ్ల పందాలకు వెళ్లేందుకున్న తీరిక.. రైతుల పరామర్శించడానికి మాత్రం లేదా అని నిలదీశారు.

చంద్రన్న ఇచ్చిన ఒక్క పిలుపుతో రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని కొనియాడారు నారా భువనేశ్వరి. రైతులకు అందరం రుణపడి ఉంటామన్నారు. సృష్టికి మూలకర్త మహిళా అని.. ఆ స్త్రీ అనుకుంటే ఏదైనా సాధించగలదన్నారు. అలాంటి మహిళలపై చేయిచేసుకోవడం ప్రభుత్వానికి మంచిదికాదని భువనేశ్వరి హెచ్చరించారు.

Tags

Next Story