జల్లికట్టులో గిత్తని పట్టు అంటున్న తమిళతంబీలు
తమిళనాడు వ్యాప్తంగా పొంగల్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించే సంప్రదాయ క్రీడ జల్లికట్టు జోరందుకుంది. గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈసారి జల్లికట్టును అధికారికంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాధికారులు దగ్గరుండి మరీ వేడుకలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు సందడి నెలకొంది. పోట్ల గిత్తలను నిలువరించేందుకు యువకులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఎద్దుల దాడిలో గాయలవుతున్నా.. ఏమాత్రం భయపడకుండా జల్లికట్టును ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నెల 31 వరకు జరిగి జల్లికట్టు క్రీడల్లో ఈసారి 2 వేలపైగా ఎద్దులు పాల్గొంటున్నాయి. అవనియపురంలో 730, అలంగనల్లూరులో 700, పలమేడులో 650 ఎద్దులు జల్లికట్టులో పాల్గొంటున్నాయి.
ఇదిలావుంటే, తొలిరోజు జల్లికట్టు వేడుకల్లో పలు చోట్ల అపశ్రుతి చోటుచేసుకుంది. అవనియపురంలో జల్లికట్టు ప్రారంభమైన కొద్ది గంటలకే 32 మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా వుండటంతో మధురై ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com