ఏపీలో కొత్త పొత్తు.. 2024లో అధికారమే లక్ష్యంగా బీజేపీ-జనసేన దోస్తీ

ఏపీలో కొత్త పొత్తు.. 2024లో అధికారమే లక్ష్యంగా బీజేపీ-జనసేన దోస్తీ

paka

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. జనసేన-బీజేపీ మధ్య దోస్తీ కుదిరింది. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కలిసి పనిచేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఏపీలో జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పొత్తు పొడిచింది. గతకొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు జనసేన-బీజేపీ తెరదించాయి. దేశ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కలిసి పనిచేయాలని నిర్ణయించారు. విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్‌ హోటల్‌లో జనసేన, బీజేపీ నేతల సమావేశం దాదాపు 3 గంటలపాటు సాగింది. జనసేన తరపున ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ హాజరుకాగా.. బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్, పురంధేశ్వరి, సోము వీర్రాజు, సునీల్‌ దేవధర్‌తో పాటు ఇతర నేతలు వచ్చారు. ప్రతి అంశంపైనా కూలంకషంగా చర్చించామన్న నేతలు.. 2024 ఎన్నికల్లో పవర్‌లోకి రావడమే టార్గెట్‌గా పనిచేయాలని నిర్ణయించారు.

ప్రస్తుత పాలేగాళ్ల రాజ్యం, గత అవినీతిమయ టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని అన్నారు జనసేన అధినేత పవన్. ఆ ప్రత్యామ్నాయమే జనసేన-బీజేపీ అని స్పష్టం చేశారు. 2024లో ఏపీలో జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ముందుగా ఇరు పార్టీల నేతలతో ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వైసీపీ, టీడీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి.. సార్వత్రిక ఎన్నికల వరకు కలిసిసాగుతామన్నారు పవన్. అవినీతి, కుటుంబ పాలనలకు చరమగీతం పాడాలని నిర్ణయించినట్లు చెప్పారు. వామపక్షాలకు తాను బాకీ లేనన్నారు పవన్. వాళ్ల కంటే ముందు బీజేపీతోనే కలిసి పనిచేశానని స్పష్టం చేశారు.. అలాగే సీఏఏపైనా క్లారిటీ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు.

ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. రాష్ట్రాన్ని అథపాతాళానికి తొక్కేశారని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. దేశ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. బీజేపీతో కలిసి పనిచేసేందుకు ఎలాంటి షరతులు లేకుండా పవన్ ముందుకు వచ్చారని చెప్పారు. వైసీపీ ప్రజావ్యతిరేక నిర్ణయాలతోపాటు.. గత టీడీపీ ప్రభుత్వహయాంలో జరిగిన అవినీతిపైనా పోరాడుతామన్నారు.

జనసేనతో కలిసి ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని ఏర్పాటు చేస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు. రాబోయే ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి.. కుల రహిత, కక్షసాధింపులేని రాజకీయాలు చేస్తామని తెలిపారు.

ప్రస్తుతం ఏపీలో రాజధాని పోరాటం ఉద్ధృతంగా సాగుతోంది. అటు త్వరలోనే.. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో జనసేన-బీజేపీ దోస్తీ ఆసక్తిరేపుతోంది. వైసీపీ, టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు రెండు పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్ణయించడం ఏపీ పాలిటిక్స్‌ను ఒక్కసారిగా హీటెక్కించాయి.

Tags

Next Story