జై అమరావతి నినాదాన్ని హోరెత్తిస్తున్న రైతులు

జై అమరావతి నినాదాన్ని హోరెత్తిస్తున్న రైతులు

protest

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం 30వ రోజుకు చేరుకుంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. రైతులు చనిపోతున్నా.. మహిళలు కంటతడి పెడుతున్నా.. వారి గోస ఎవరికి పట్టడం లేదు. ఇప్పటికే పండగకు దూరంగా ఉన్న రాజధాని గ్రామాల రైతులు.. పోరును మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. గురువారం మందడం, తుళ్లూరులో మహాధర్నాకు దిగారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో 30వరోజు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెంతో పాటు ఇతర రాజధాని గ్రామాల్లోనూ నిరసనలు హోరెత్తాయి. జై అమరావతి అని నినదిస్తున్నారు.

రాజధాని రైతుల పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతున్నారు. విపక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు దీక్షా శిబిరాలకు చేరుకుని రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. గురువారం అమరావతిలో నందమూరి బాలకృష్ణతో పాటు సీపీఐ నేతలు పర్యటించనున్నారు. బాలకృష్ణ వారిని కలుసుకుని భరోసా కల్పించనున్నారు. అటు సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ, నాగేశ్వరావు.. దీక్షా శిబిరాలను సందర్శించి రైతులను సంఘీభావం తెలపనున్నారు. ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు.

గత 30 రోజులుగా ఆందోళనలు చేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తాము ఈ రాష్ట్రంలోనే ఉన్నామా? ఇక్కడ ప్రభుత్వం అనేది ఉందా అని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలు పోయినా సరే అమరావతిని రాజధానిగా సాధించుకుంటామని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story