జల్లికట్టు.. గిత్తలు నై అంటున్నా.. యువకులు మాత్రం సై అంటున్నారు

తమిళనాడులో రెండో రోజు జల్లికట్టు జోరుగా కొనసాగుతోంది. బుధవారం మధురైజిల్లా అవనీయపురంలో పోటీలు ప్రారంభంకాగా.. గురువారం పాలమేడులో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఎద్దుల కొమ్ములు వంచేందుకు యువకులు పోటీ పడుతున్నారు. వాటిని లొంగదీసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది మంది యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా లెక్క చేయకుండా గిత్తకు ఎదురెళ్లి కాలు దువ్వుతున్నారు.
ఈసారి జల్లికట్టులో అవనీయపురంలో 730 ఎద్దులు, అలంగనల్లూరులో 700, పలామెడులో 650 ఎద్దులను రంగంలోకి దించారు. పోటీపడే యువకులు బృందాలుగా విడిపోయారు. ఒక్కో బృందం 60 ఎద్దులతో పోటీ పడుతోంది. పెద్ద సంఖ్యలో హాజరైన సందర్శకుల కేరింతల మధ్య యువకులు ఎద్దుల్ని లొంగదీసుకునే ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. గిత్తలు కొమ్ములతో కుమ్మేస్తున్నా.. యువకులు ఏమాత్రం భయపడడం లేదు. తొడగొట్టి మరీ వాటిని పట్టుకునేందుకు సై అంటున్నారు.
అవనీయపురంలో జరిగిన జల్లికట్టులో కొంత మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జల్లికట్టు పోటీల వద్ద 21 అంబులెన్సులను అధికారులు సిద్ధంగా ఉంచారు. సందర్శకులు, పోటీదారులకు మధ్య పటిష్టమైన బారికేడ్లను నిర్మించారు. జల్లికట్టు సందర్భంగా పరిస్థితిని సమీక్షించేందుకు పోలీసుల పహరా ఏర్పాటు చేశారు. 12 క్లోజ్డ్ టెలివిజన్ కెమెరాలతో జల్లికట్టు క్రీడను చిత్రీకరిస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com