బీజేపీ-జనసేన పొత్తుపై రానున్న క్లారటీ

బీజేపీ-జనసేన పొత్తుపై రానున్న క్లారటీ

JANASENA

ఏపీలో బీజేపీ-జనసేన మధ్య స్నేహం చిగురిస్తోందా? ఇకపై ఇరు పార్టీలు కలిసి ముందుకు సాగనున్నాయా? ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరకనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గురువారం కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. విజయవాడలో జనసేన, బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ రెండు పార్టీలు ప్రజాసమస్యలపై పోరాడేందుకు ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాజధాని ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. జనసేనాని, కమలదళంతో కలసి నడుస్తారని ప్రచారం జరుగుతుంటడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఉదయం 11 గంటలకు MG రోడ్‌లోని ఓ హోటల్‌లో జనసేన-బీజేపీ నేతల భేటీ జరగనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదేండ్ల మనోహార్, ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్, సునీల్ దేవధర్ ఈ మీటింగ్‌కు హాజరువుతున్నారు. ఈ సమావేశం తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఇరు పార్టీల మీడియా సమావేశం ఉంటుంది. రాజధాని అమరావతి అంశం, ప్రజాసమస్యలపై పోరాటంలో కలిసి పనిచేయడంపై రెండు పార్టీలు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

ఏపీలో అమరావతి ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. 29 గ్రామాలకే పరిమితమైందనుకున్న ఉద్యమం.. ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోంది. రాజధానిని మార్చాలన్న నిర్ణయాన్ని బీజేపీ, జనసేన రెండూ వ్యతిరేకిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను కూడా ఇరు పార్టీలు ఎండగడుతున్నాయి ఇక ఇటీవలే ఢిల్లీ వెళ్లిన పవన్.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఏపీలోని పరిణామాలన్నింటినీ ఆయనకు వివరించారు. రాజధాని మార్పు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మహిళలపై పోలీసుల దమనకాండ, ఇటీవల కాకినాడలో జనసైనికులపై జరిగిన దాడి వంటి అంశాలను చర్చించారు. పవన్ హస్తిన పర్యటన ముగిసిన వెంటనే జరుగుతున్న ఈ సమావేశం.. రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

రాజధాని అంశంతోపాటు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపైనా గతకొంతకాలంగా జనసేన, బీజేపీలు ఒకే వాయిస్‌ను వినిపిస్తున్నాయి. దీంతో ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ స్నేహబంధం చిగురించిందన్న వార్తలు వచ్చాయి. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై మరింత క్లారిటీ వచ్చింది. గురువారం సమావేశంలో ఈ రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణపై ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story