బొత్సపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు

బొత్సపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు

BOTSA-COFEE

రాజధాని గ్రామాలు 31 రోజులుగా అట్టుడుకుతున్నాయి. సంక్రాంతి కూడా జరుపుకోకుండా ప్రజలు దీక్షలకే పరిమితమయ్యారు. పోలీసుల దమనకాండ, లాఠీఛార్జ్‌నూ లెక్కచేయలేదు. రక్తం చిందినా జై అమరావతి నినాదం మానలేదు. అక్కడ అంత సీరియస్‌గా, ప్రాణాలకు తెగించి రైతులు పోరాటం చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం వారి బాధను, ఆవేదనను పెద్దగా చెవికెక్కించుకున్నట్లు కనపడంటం లేదు. హైపవర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడిన తీరు చూస్తే.. ప్రభుత్వం రాజధాని రైతులపట్ల ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు గ్రామాల రైతులొచ్చారు. గంటసేపు కూర్చొని మాట్లాడాను. కాఫీ ఇచ్చాను. తాగించాను.. అంటూ చాలా సింపుల్‌గా తేల్చేశారు. అసలు ఇబ్బందులే లేవన్నట్లుగా మాట్లాడారు. బొత్స మాటలపై రాజధాని రైతులు ఆగ్రహంగా ఉన్నారు.

GN రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చించిన అంశాలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లింది హైపవర్‌ కమిటీ. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సుమారు రెండు గంటలకు పైగా సమావేశం అయ్యారు. సీఎంకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానతలపైనే అధికంగా చర్చించారు. సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని ఈ భేటీలో నిర్ణయించారు. తాము అధ్యయనం చేసిన పూర్తి అంశాలను కేబినెట్‌ ముందుంచుతామన్నారు మంత్రి బొత్స.. రైతులు ముందుకు వస్తే ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

అమరావతిలోని అసెంబ్లీ తాత్కాలికమని గతంలో చంద్రబాబు అనలేదా అని బొత్స నిలదీశారు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు శాశ్వత అసెంబ్లీ అంటున్నారని ప్రశ్నించారు. అలాగే బీజేపీ-జనసేన పొత్తుపై స్పందించిన ఆయన.. రాష్ట్రంలో ఏ పార్టీ ఏ పార్టీతో కలిసినా తమకు ఇబ్బంది లేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story