అమరావతిలో అసెంబ్లీ తాత్కాలికమని గతంలో చంద్రబాబు అన్నారు: బొత్స

జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చించిన అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లింది హైపవర్ కమిటీ. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సుమారు రెండు గంటలకు పైగా ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు హైపర్ కమిటీ సభ్యులు. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానతలపైనే అధికంగా చర్చించారు. సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని ఈ భేటీలో నిర్ణయించారు. తాము అధ్యయనం చేసిన పూర్తి అంశాలను కేబినెట్ ముందుంచుతామన్నారు మంత్రి బొత్స..
రాజధాని రైతుల ఆందోళనలపైనా ఈ సమావేశంలో చర్చించామన్నారు బొత్స. రైతులు ముందుకు వస్తే ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతం విషయంలో మద్రాస్ ఐఐటీ నివేదిక ఇచ్చింది అనడం అవాస్తవం అన్నారు.
అమరావతిలోని అసెంబ్లీ తాత్కాలికమని గతంలో చంద్రబాబు అనలేదా అని బొత్స నిలదీశారు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు శాశ్వత అసెంబ్లీ అంటున్నారని ప్రశ్నించారు. అలాగే బీజేపీ-జనసేన పొత్తుపై స్పందించిన ఆయన.. రాష్ట్రంలో ఏ పార్టీ ఏ పార్టీతో కలిసినా తమకు ఇబ్బంది లేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com