బీజేపీ - జనసేన కలయిక సంతోషకరం : చంద్రబాబు

బీజేపీ - జనసేన కలయిక సంతోషకరం : చంద్రబాబు

అమరావతి పరిరక్షణ కోసం అందరిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్ర చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. అమరావతి కోసం పోరాడుతున్న చంద్రబాబు నారాయణపురం, గణపవరం, ఉండి, భీమవరం, పాలకొల్లు, మార్టేరుల్లో పర్యటించారు.

నారాయణ పురం దగ్గర మాజీ ఎమ్మెల్యే జి.వీరాంజనేయులు ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. నారాయణపురంలో చంద్రబాబు నాయుడు కొంతదూరం పాదయాత్ర చేస్తూ జోలెపట్టి విరాళాలు సేకరించారు. స్థానిక దుకాణదారులు, రైతులు, యువకులు విరాళాలు అందజేశారు..

ఉండిలో మాట్లాడిన ఆయన బీజేపీ - జనసేన కలయిక సంతోషకరం అన్నారు. అయితే అమరావతి కోసం ఇద్దరూ కలిసి పోరాడాలని.. జగన్ కు భయపడి వెనక్కి వెళ్లకూడదని కోరారు..

గణపవరంలో టీడీపీ కార్యకర్తలతో కలిసి బైక్‌ ర్యాలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. తరువాత జోలె పట్టి గణపవరం వీధుల్లో చంద్రబాబు పర్యటించారు. అమరావతిని విధ్వంసం చేయడానికి సీఎం జగన్‌ కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

భీమవరంలో పర్యటించిన ఆయన అక్కడ కూడా జోలె పట్టారు. వాస్తవాలు మాట్లాడుతున్నందుకే టీవీ5 పై ప్రభుత్వం కక్ష కట్టిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. MSOలను బెదిరించి ప్రసారాలు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ట్రాయ్ నిబంధనలు కూడా ఉల్లంఘించడంపై చంద్రబాబు మండిపడ్డారు..

తరువాత పాలకొల్లు, మార్టేరుల్లో పర్యటించిన ఆయన.. ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని ఉండాలని.. దీనిపై ప్రజా చైతన్యం రావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. తమ సమస్యల కోసం బయటికి వచ్చే ఉద్యోగులు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. NGOలు ఎక్కడున్నారన్నారు. ఆనాడు సమైక్య ఉద్యమం చేసిన ఉద్యోగస్తులు... ఇప్పుడు ఎందుకు బయటకు రావడం లేదని చంద్రబాబు నిలదీశారు. ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్జీవోలు అంతా కలిసి ఈ నెల 20 అసెంబ్లీ ముట్టడిలో పాల్గొనాలని.. తాము అసెంబ్లీలో పోరాడితే.. మిగిలిన వారు బయట పోరాడాలని పిలుపు ఇచ్చారు.. ఎంతమందిని పోలీసులు అరెస్టు చేస్తారో చూద్దామంటూ అమరావతిపై సమరశంఖం పూరించారు.

Tags

Next Story