ఢిల్లీలో జోరందుకున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. భారతీయ జనతాపార్టీ భారీ స్థాయిలో ప్రచారానికి సిద్ధమైంది. 20 రోజుల్లో సుమారు 5 వేల సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభలన్నీ కూడా స్థానికంగా జరిగేవే. స్థానిక ప్రజలతో మమేకమయ్యేలా కార్యక్రమాలు ఉండాలని బీజేపీ నాయకత్వం సూచించింది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో రోజుకు 3 లేదా 4 బహిరంగ సభలు నిర్వ హించనున్నారు. అంటే రోజుకు దాదాపు 250 సభలు ఉంటాయి. ప్రజలను ప్రత్యక్ష్యంగా కలుసుకోవడానికే చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నేతలు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కనీసం 10 బహిరంగసభల్లో పాల్గొంటారని సమాచారం.
ఇక, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ జోరు పెంచింది. ఇప్పటికే సీఎం కేజ్రీవాల్ సహా మంత్రులంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. తాజాగా కేజ్రీవాల్ కుటుంబసభ్యులు కూడా రంగంలోకి దిగారు. కేజ్రీవాల్ భార్య సునీత, కుమార్తె హర్షిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేజ్రీవాల్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి అధికారం అప్పగించాలని కోరారు.
ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలున్నాయి. ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 11న జరుగుతుంది. ఈ ఎన్నికలను ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ దాదాపు 60 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com