వైసీపీ సర్కార్ మెడకు చుట్టుకుంటున్న ఐఐటీ మద్రాస్ ఇ-మెయిల్
రాజధాని నిర్మాణానికి అమరావతి సేఫ్ కాదన్నారు. ఇదిగో ఐఐటీ మద్రాస్ ఇచ్చిన రిపోర్టే ఇందుకు సాక్షమన్నారు. బీసీజీ రిపోర్టులో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. స్వయంగా ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ఈ నివేదికను చదివి వినిపించారు. ఐఐటీ మద్రాస్ అమరావతిలో సాయిల్ స్ట్రెంగ్త్ ను స్టడీ చేసిందని స్పష్టంగా చెప్పారు. 2009లో వరదల్లో మునిగిపోయిన ప్రాంతమే ఇప్పటి అమరావతి అంటూ మ్యాప్‌లతో సహా వివరించారు.
అయితే ఈ ప్రచారానికి బ్రేక్ వేసింది ఐఐటీ మద్రాస్. తాము అలాంటి నివేదిక ఏదీ ఇవ్వలేదని స్పష్టంచేసింది. అమరావతిలో నిర్మాణాలు సురక్షితం కాదని తాము చెప్పలేదని.. అక్కడి నేలలో బలం లేదని నివేదిక ఇచ్చామనడం కూడా అబద్ధమని స్పష్టం చేసింది. ఐఐటీ మద్రాస్ పంపిన ఇ-మెయిల్ ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అమరావతిపై నెగెటివ్ ప్రచారం చేయాలనుకున్న ప్రభుత్వ వ్యూహం మరోసారి బెడిసి కొట్టినట్లైంది. ఇక చెన్నై ఐఐటీ నివేదికపై మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స నేరుగా సమాధానం చెప్పలేదు. కావాలంటే మీరు కూడా చెన్నై ఐఐటీకి మెయిల్ పెట్టుకోండి. మేం చెప్పేవన్నీ అబద్ధాలే అంటారా..? అంటూ ఎదురు ప్రశ్నించారు.
రాజధానిని అమరావతి నుంచి తరలించాలనే పట్టుదలతో ఉన్న జగన్ సర్కారు, అందుకు అనుగుణంగా జీవిరావు, బోస్టన్ కమిటీలను ఏర్పాటు చేసింది. సర్కార్ ఊహలకు అనుగుణంగానే.. రెండు కమిటీలు కూడా రిపోర్టులు ఇచ్చాయి. సహజంగా సర్కారు ఏ కమిటీ వేసినా అది కొంత కసరత్తు చేస్తుంది. వివిధ వర్గాల ప్రజలను కలసి, తన అభిప్రాయాలను జోడించి, సర్కారుకు అనుకూలంగా ఒక నివేదిక ఇస్తుంటుంది. ఇది అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వంలోనయినా జరిగేదే. అయితే, ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. అసలు నివేదికనే ఇవ్వని ఒక ప్రఖ్యాత సంస్థను ఈ వ్యవహారంలో ఈడ్చారు. ఆ సంస్ధ కూడా అమరావతిని రాజధానిగా పనికిరాదని చెప్పిందన్నారు. ఇదే, వైసీపీ సర్కార్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.
అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని, అది ముంపు ప్రాంతమని స్వయంగా మద్రాస్ ఐఐటీ నివేదిక ఇచ్చిందని జీవీ రావు కమిటీ తన నివేదికలో పేర్కొంది. అంతేనా..? ఐఏఎస్ ఆఫీసర్ విజయకుమార్ కూడా దానిని నిర్ధారించారు. అమరావతి ముంపు ప్రాంతమని మద్రాసు ఐఐటీ కూడా నివేదిక ఇచ్చిందని, బీసీజీ తన నివేదికలో ఈ విషయం వెల్లడించిందని పురపాలక శాఖ డైరక్టర్ హోదాలో ఆయన కూడా సర్టిఫై చేశారు. ఇంతమంది మేధావులు చెప్పిన తర్వాత.. తమది ముంపు ప్రాంతం కావొచ్చని అమరావతి ప్రాంతవాసులు అనుకునే ప్రమాదం వుంది. దీంతో అమరావతి రైతులు మద్రాసు ఐఐటీని ఆరా తీశారు. దీనికి రిప్లై ఇచ్చిన ఐఐటీ మద్రాసు అసలు విషయం తేల్చేసింది. అసలు తాము అలా చెప్పనేలేదని రిప్లై ఇచ్చింది. మరి, అమరావతి ముంపు ప్రాంతమని మద్రాస్ ఐఐటీ కూడా నివేదిక ఇచ్చిందని ఐఏఎస్ విజయ్‌కుమార్, మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు ఎలా చెప్పారు..?
మద్రాసు ఐఐటీ పేరుతో అబద్ధాన్ని నిజం చేసి.. మూడు రాజధానుల కాన్సెప్ట్ ను పట్టాలెక్కించాలనుకోవడం ఎంతవరకు సమంజసం.. దీనికి వైసీపీ సర్కారే సమాధానం చెప్పాలంటున్నారు అమరావతి రైతులు. తమ నోట్లో మట్టి కొట్టి అబద్ధాలతో అమరావతిని తరలించాలని చూసిన జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com