రేపటి అసెంబ్లీ, కేబినెట్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ.. కట్టుదిట్టమైన భద్రత

రేపటి అసెంబ్లీ, కేబినెట్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ.. కట్టుదిట్టమైన భద్రత

మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ విపక్షాలు, అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ఆంక్షలతో నిరసనలను అణచివేసేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర విపక్షాల నేతలతో పాటు రైతులకు నోటీసులు ఇస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

ఛలోఅసెంబ్లీ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలందరికి నోటీసులు అందజేశారు. కేశినేని నాని, అచ్చెన్నాయుడు, గద్దెరామ్మోహన్‌లతో పాటు జేఏసీ నేతల ఇంటికి ఇప్పటికే నోటీసులు పంపించారు. రేపటి నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటికి వచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చారని.. తనను నిరంతరం ఫాలో అవుతున్నారని ఆరోపించారు.

రేపు అసెంబ్లీ సమావేశాలకు సీఎం జగన్‌ వెళ్లేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సీఎం నివాసం నుంచి అసెంబ్లీకి వెళ్లే మార్గంలో కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఇంటి నుంచి సచివాలయం వెళ్లే దారిలోని కీలకమైన పాయింట్లలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో చెక్‌పోస్టులను పెట్టారు.

మరోవైపు రేపటి అసెంబ్లీ, కేబినెట్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేబినెట్‌ నోట్స్‌, అసెంబ్లీ బిల్లులు అత్యంత గోప్యంగా తయారవుతున్నాయి. సీఎం క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్‌.. రేపు ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించి ప్రభుత్వ వ్యూహంపై చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story