ఆసీస్‌కు తన దెబ్బేంటో రుచి చూపించింది టీమిండియా
ఆసీస్‌కు తన దెబ్బెంటో రుచి చూపింది టీమిండియా. 10 వికెట్లతో తొలి మ్యాచ్‌లో ఓడిన కోహ్లీసేన.. దెబ్బతిన్న పులిలా విజృంభించింది. రెండు మ్యాచుల్లో పంజా విసిరి.. ఆసీస్‌ను చిత్తు చేసి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. బెంగళూరులో వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. హిట్ మ్యాన్ రోహిత్, కింగ్ కోహ్లీ వీర విహారంతో కంగారులు చేతులెత్తేశారు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది. ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్... ఆ తరువాత స్మిత్, లబుషైన్ నిలకడగా ఆడి స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. అయితే చివరి ఓవర్లలో భారత్ పొదుపుగా బౌలింగ్ వేస్తూ వికెట్లు తీయడంతో స్కోరు మందగించింది. షమీ నాలుగు వికెట్లు తీసుకుని మ్యాచును మలుపు తిప్పాడు. దీంతో 50 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయిన ఆసీస్ జట్టు.. 50 ఓవర్లలో 287 పరుగులు మాత్రమే చేసింది.
ఆ తరువాత 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. రాహుల్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాట పట్టినా.. ఆ తరువాత వచ్చిన రోహిత్‌శర్మ, కోహ్లీ మెరుపులు మెరిపించారు. సెంచరీ వీరుడు రోహిత్ 119 పరుగులతో కనువిందు చేశాడు. రోహిత్ పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ 89 పరుగులతో మ్యాచ్‌లో భారత్ విజయానికి బాటలు వేశాడు. వీరిద్దరూ కలిసి 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. రోహిత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా బ్యాటు జులిపించడంతో భారత్ విజయం సులువైంది. మరో 15 బంతులు మిగిలుండగానే 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది కోహ్లీసేన.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com