ఉబ్బసంతో బాధపడేవారు తినకూడని పదార్థాలు..

ఉబ్బసం వంశపార్యంగా వచ్చే ఒక వ్యాధి. అలర్జీ కారణంగా వస్తుంది. అసలు ఏ కారణం లేకపోయినా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా మందికి జలుబుతో మొదలై పిల్లికూతలు వస్తుంటాయి. గొంతులో గురగురమంటూ శబ్దం వస్తుంది. మార్కెట్లో దొరికే మందులతో కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఇది పూర్తిగా తగ్గే వ్యాధి కాదు. కాబట్టి జీవితకాలం మందులు వాడాల్సి ఉంటుంది.
వ్యాధి తీవ్రతను తగ్గించుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారపుఅలవాట్లు ఏర్పరచుకోవాలి. వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. ఉబ్బస వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న వ్యక్తుల్లో ఊపిరి తీసుకునే గాలి గొట్టాలు చాలా వరకు మూసుకుపోవడం వలన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలకు ప్రాణవాయువు అందడం కష్టమవుతుంది. ఈ వ్యాధితో బాధపడేవారు దుమ్ముధూళి ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఆస్తమాను తీవ్రతరం చేసే ఆహారపదార్థాలను తీసుకోకపోవడం మంచిది.
పాల పదార్థాలకు ఉబ్బస రోగులు దూరంగా ఉండాలి. పాల ఉత్పత్తులు ఉబ్బసం ప్రేరేపించే అవకాశం ఉంది. ఐస్‌క్రీం, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు ఉబ్బసాన్ని రేకెత్తిస్తాయి. ఇంకా గుడ్లు, సిట్రస్ పండ్లు, గోధుమలు, సోయా ఉత్పత్తులు ఉబ్బసాన్ని తీవ్రతరం చేస్తాయి. కఫం ఏర్పడడానికి కారణమయ్యే ఆహారాలు అరటి, బొప్పాయి, బియ్యం, చక్కెర, పెరుగు.. ఇవి జలుబును తీసుకువస్తాయి.
ఇంకా సులభంగా జీర్ణం కాని కాఫీ, టీ, సాస్, ఆల్కహాల్ మొదలైనది తీసుకుంటే అవి ఉబ్బసాన్ని ఎక్కువ చేస్తాయి. ఆరోగ్యంగా ఉన్న వారికి నట్స్ (డ్రై ఫ్రూట్స్) మంచివి. కానీ ఉబ్బసంతో బాధపడేవారు మాత్రం నట్స్ తీసుకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఫాస్ట్ ఫుడ్స్‌కి కూడా ఆస్తమా రోగులు దూరంగా ఉండాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com