ఇవాళ్టి నుండి అమల్లోకి తిరుమలలో శ్రీవారి ఉచిత లడ్డూ విధానం
ఇవాళ్టి నుండి తిరుమలలో శ్రీవారి ఉచిత లడ్డూ విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎనిమిది అదనపు లడ్డూ కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. ఉచిత లడ్డు ప్రవేశపెట్టి..సబ్సిడీ కింద భక్తులకు ఇచ్చే లడ్డులను మాత్రం పూర్తిగా రద్దు చేసింది. ప్రతి ఏటా సబ్సిడి లడ్డూ ద్వారా 250 కోట్ల రూపాయల వరకూ నష్టం వాటిల్లుతోంది. శ్రీవారి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూను అందిస్తూ..కావల్సినని అదనపు లడ్డూలను 50 రూపాయలకు ఒకటి చొప్పున అందించనుంది. ఈ నిర్ణయంతో 116 కోట్ల రూపాయల వరకూ టీటీడీపై భారం తగ్గే అవకాశాలు కనిపిస్తోంది.
దివ్యదర్శనం వచ్చే భక్తులకు ఒక లడ్డును ఉచితంగా అందిస్తూ..సబ్సీడీలో 20 రూపాయలకు రెండు లడ్డూలు, 50కి మరో రెండు లడ్డూలు ఇస్తూ వస్తున్నారు. సర్వదర్శనం భక్తులకు 20 రూపాయలకి రెండు, 50కి మరో రెండు లడ్డులు అందిస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి, ఇతర ఆర్జిత సేవలకి వెళ్ళే భక్తులకి 2 లడ్డుల చోప్పున అందిస్తోంది టీటీడీ. అంతకు మించి అదనపు లడ్డూలు కావాలంటే 50 రూపాయల చోప్పున కొనుక్కోవాల్సి ఉంటుంది.
టీటీడీ బూందీపోటులో రోజుకు 3 లక్షల లడ్డూలు తయారవుతాయి. ఒక్కో లడ్డూ తయారీకి 40 రుపాయల చొప్పున ఖర్చు అవుతోంది. ఈ లెక్కన కాలినడక ద్వారా వచ్చే ఒక్కో భక్తుడికి 130 రూపాయల రాయితీ లభిస్తోంది. సర్వదర్శనానికి వచ్చే భక్తుడుకి 90 రూపాయల రాయితీ..ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చే ఒక్కో భక్తుడికి 80 రూపాయల రాయితీపై అందిస్తోంది. ఈ రాయితీల వల్ల టీటీడీకి ఏటా 250 కోట్లలకు పైగా అదనపు భారం పడుతోంది.
లడ్డూ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు టీటీడీ ఇవాళ్టి నుంచి కొత్త విధాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఒక లడ్డూను పూర్తిగా ఉచితంగా ఇస్తూనే..మిగిలిన సబ్సిడీల్లో కోత విధించింది. దీంతో టీటీడీ 116 కోట్ల రూపాయల వరకూ భారం తగ్గే అవకాశాలు కనిపిస్తోంది. పైగా ప్రతీ భక్తుడు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పొందవచ్చు. ఇక భక్తులకు లడ్డూల కొరత లేకుండా ఇక నుంచి రోజుకు 5 లక్షల వరకు లడ్డూలను తయారు చేయాలని కూడా నిర్ణయించారు. అలాగే అదనపు లడ్డూల విక్రయాలకు 12 ఎల్.పి.టి కౌంటర్లు టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com