తెలంగాణలో పురపాలక ప్రచారానికి నేటితో తెర

తెలంగాణలో పురపాలక ప్రచారానికి నేటితో తెర

గత పది రోజులకు పైగా.. హోరెత్తిన పురపాలక ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 22న ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. పట్టణాలు, నగరాల్లో మోగిన మైకులు మూగబోనున్నాయి. ఈ నెల 24న ఎన్నికలు జరగనున్న కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలో మాత్రం బుధవారం వరకు ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంది.

ఈ పురపాలక ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగింది. అధికార టిఆర్‌ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్‌, బీజేపీలు ప్రచారం నిర్వహించాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం ఓ రేంజ్‌లో హోరెత్తింది. ఇక పోలింగ్‌కు ఒక్క రోజు మాత్రమే ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు పలు రూపాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం కానున్నారు.

అధికార టీఆర్‌ఎస్‌ పక్షాన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలే అన్ని బాధ్యతలు తీసుకొని ప్రచారం నిర్వహించడంతోపాటు స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. తన నియోజకవర్గమైన సిరిసిల్ల వరకే ప్రచారానికి పరిమితమైన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఎన్నికల ప్రచార శైలిని పర్యవేక్షిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచనలిచ్చారు. సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా హరీష్‌ రావు ప్రచారాన్ని పరుగులు పెట్టించారు.. ఇక మంత్రులంతా వారి నియోజకవర్గాల్లో కాలికి బలపం కట్టుకు తిరిగారు..

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్‌ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు.

బీజేపీ పక్షాన రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పర్యటించగా ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు ఇతర కీలక నేతలు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. ఎంఐఎం తరఫున ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా వామపక్షాలు, టీజేఎస్‌ తదితర పార్టీల నేతలు కూడా ప్రచారం నిర్వహించారు.

మరోవైపు అన్ని ప్రధాన పార్టీలకు.. రెబల్స్‌ పోటీ తప్పలేదు. టికెట్లు ఆశించి భంగపడి రెబల్స్‌గా బరిలోకి దిగిన అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రులుగా బరిలో ఉన్న దాదాపు 3 వేల మందికిపైగా అభ్యర్థులు సైతం సత్తా చాటేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story