మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం

మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం

మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 7 వేల 961 కేంద్రాల్లో బ్యాలెట్‌ ద్వారా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. 120 మున్సిపాలిటీల పరిధిలోని 2 వేల 648 వార్డులు, 9 కార్పొరేషన్‌లలోని 324 డివిజన్లలో, GHMC డబీర్‌పురా డివిజన్‌ ఉప ఎన్నికతో సహా... తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రాలతో.. పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలుఏర్పాటు చేసి, పోలింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేస్తారు. పోలింగ్‌ సరళిని తెలుసుకునేందుకు.. 2 వేల 355 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి నుంచే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో లోకల్‌ హాలిడే ప్రకటిస్తూ... ఆయా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో పోలింగ్‌కు సంబంధించిన ఎన్నికల సామాగ్రిని తరలించారు. జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఎన్నికల స్పెషల్‌ ఆఫీసర్‌ ITDA PO గౌతమ్‌ పరిశీలించారు. వైరా మున్సిపాలిటీలోని 39 పోలింగ్‌ కేంద్రాల్లో 350 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు.

వరంగల్ రూరల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 24 వార్డుల్లో 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 18 సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులతో భారీ బందోబస్తు చేపట్టారు.

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. 12 వార్డుల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. RDOతోపాటు పోలీసు అధికారులు.. పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ మున్సిపాలిటీలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ZPHS హై స్కూల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో పోలింగ్‌ అధికారులకు సామాగ్రి పంపిణీ చేశారు. ఇక్కడ 25 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో RGIA పోలీసులతో కలిసి ప్రత్యేక పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పురపోరు ఎన్నికల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మొత్తం 11 మున్సిపాలిటీల్లో 319 వార్డులకు గాను ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు జిల్లాల కలెక్టర్‌లు.. పోలింగ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ సామాగ్రితో పోలింగ్ స్టేషన్లకు తరలివెళ్లారు.

నిర్మల్‌ జిల్లాలో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో అరేంజ్‌మెంట్స్‌ పూర్తయ్యాయి. మూడు మున్సిపాలిటీల పరిధిలో 80 వార్డులు ఉండగా... వాటిలో ఐదు ఏకగ్రీవమయ్యాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో... రాష్ట్ర పోలీసులతోపాటు ప్రత్యేక కేంద్ర బలగాలను రప్పించారు.

మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా.. మహబూబాబాద్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఏర్పాట్లను కలెక్టర్‌ శివలింగయ్య పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీలో... ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. ఇక్కడి 82 వార్డుల్లో 6 ఏకగ్రీవం కాగా... 76 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 26 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ చేపడుతున్నట్టు తెలిపారు అధికారులు. పోలింగ్ కేంద్రాలకు సెల్‌ఫోన్‌లు వెంటతెచ్చుకోవద్దని అధికారులు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story