అమరావతిలో అర్థరాత్రి హై టెన్షన్
అమరావతిలో అర్థరాత్రి వరకు హై టెన్షన్ నెలకొంది. అరెస్టులు ఆందోళనలతో పరిస్థితి రణరంగంగా మారింది. చంద్రబాబు సహా, టీడీపీ నేతలను అసెంబ్లీ బయట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి 12 గంటలు దాటినంత వరకు వాహనంలోనే తిప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారనే ప్రచారం జరగడంతో భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు మంగళగిరి చేరుకుని పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంతకుముందు అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా.. లాభీల్లో కిందనే కూర్చొన్నారు. ఇతర టీడీపీ నేతలతో కలిసి ధర్నా చేశారు. దీంతో లాబీల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం కాన్వాయ్ ముందు బైఠాయించారు. దీంతో వారిన పోలీసులు అడ్డుకున్నారు. తరువాత రైతులకు సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా మందడం వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే మందడంలో 144 సెక్షన్ ఉందని.. అటు వెళ్లడానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
రైతులను పరామర్శించడం కూడా తప్పేనా అని పోలీసులతో.. టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో చంద్రబాబు, సహా టీడీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. దాదాపు రెండు గంటల పాటు పోలీసు వాహనంలోనే ఉంచి వారిని తిప్పారు. చంద్రబాబు నివాసానికి తీసుకెళ్తామని చెప్పి.. వాహనాన్ని దారి మళ్లించారు. కరకట్ట వైపు కాకుండా వెంకటాయపాలెం వైపు మళ్లించారు. మళ్లీ మందడం, కృష్ణాయపాలెం నుంచి ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వైపు తీసుకెళ్లారు.
మంగళగిరి వైపు చంద్రబాబు తరలిస్తున్న వాహనాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఆపారు. రహదారిపై భైఠాయించి ఆందోళన చేశారు. డొంకరోడ్డులో వాహనాన్ని తిప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఓ చీకటి రోజని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు అమరావతిని చంపేయాలనే గోరమైన తప్పిదానికి శ్రీకారం చుట్టారన్నారు. జగన్ వయసులో చిన్న వాడైనా దణ్ణం పెట్టి అడిగినా.. కనికరం చూపించలేదన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com