చర్చనీయాంశమవుతున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వ్యవహారం

చర్చనీయాంశమవుతున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వ్యవహారం

RAPAKA

నెలరోజులుకు పైగా అమరావతి అట్టుడికిపోతున్నా.. వైసీపీ మూడు రాజధానులకే ఓటేసింది. అమరావతిని శాసన రాజధానిగా.. విశాఖను పరిపాలన రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా నిర్ణయించేసింది. ఊహించినట్టుగానే ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్ రీజియన్ యాక్ట్ 2020 అసెంబ్లీలో ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. తనకున్న బలంతో బిల్లును ఆమోదింపజేసుకుంది. ఓటింగ్ లో కూడా మెజారిటీ సభ్యులు ప్రభుత్వ నిర్ణయానికే ఓటేశారు. అయితే, ఈ బిల్లుకు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది.

గత కొద్ది రోజులుగా పార్టీలో అంటీ ముట్టనట్టుగా వ్యవరిస్తున్న రాపాక.. అధికారం వైసీపీతో టచ్ లో వుంటూ వస్తున్నారు. అన్ని విషయాల్లో వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశానికి కూడా మద్దతు తెలుపుతానని ముందే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానులపై ఓటింగ్ జరిగితే తాను కూడా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నట్టు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, వికేంద్రీకరణ పరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని అన్నారు.

దీంతో, పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా వెళ్తున్న రాపాకను.. పవన్ కల్యాణ్ ముందే హెచ్చరించారు. అసెంబ్లీలో జనసేన తరుపున మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించాల్సిందిగా వరప్రసాద్ కి లేఖ రాసి మరీ ఆదేశాలు జారీ చేశారు. అయితే, అధ్యక్షుడి మాటను పెడచెవిన పెట్టిన రాపాక.. జగన్ సర్కార్ కే జై కొట్టారు. దీంతో రాపాక వ్యవహారం చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, ఇన్ని రోజులు పార్టీ స్టాండ్ కి విరుద్ధంగా వెళ్లి.. తన వ్యక్తిగత అభిప్రాయం అని సమర్ధించుకున్న రాపాకపై.. పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Next Story