ఇక్కడ హైకోర్టు ఫుల్ బెంచ్ పెట్టాలి : కర్నూలు వాసుల డిమాండ్

ఇక్కడ హైకోర్టు ఫుల్ బెంచ్ పెట్టాలి : కర్నూలు వాసుల డిమాండ్

రాష్ర్టంలో సమాంతర అభివృద్ది పేరుతో ఏపి ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ చేపడుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టంలో మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చి శాసనసభలో బిల్లును ఆమోదించుకుంది. పాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి కాగా... న్యాయ రాజధానిగా కర్నూలు పేరును ప్రకటించింది. శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం హై కోర్ట్ ని కర్నూలుకి కేటాయించి రాయలసీమకు న్యాయం చేకూరుస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూల్లో హైకోర్టు ఫుల్ బెంచ్ పెట్టాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని జిల్లాలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతోపాటు మెజార్టీ ప్రజలు తప్పు పడుతున్నారు. దేశంలో ఏ రాష్ర్టంలో లేని విధంగా ఏపిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారని విమర్శిస్తున్నారు. రాయలసీమ జిల్లాల వాసులు కూడా ఈ మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. పాలన రాజధాని విశాఖలో ఏర్పాటుచేస్తే తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మొదట కర్నూల్లో ఉన్న రాజధానిని ఇప్పుడు కర్నూల్లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగా కర్నూలుకు హైకోర్టును స్వాగతిస్తున్నా....పాలన వికేంద్రీకరణపై పెదవి విరుస్తున్నారు. అందరికి అందుబాటులో ఉన్న అమరావతిలోనే రాజధాని ఉండాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకో పక్క న్యాయ రాజధాని, కర్నూల్లో హై కోర్ట్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో దీనిపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హై కోర్ట్ ఏ ప్రాంతంలో ఏర్పాటుచేస్తారోనని చర్చించుకుంటున్నారు. ఓర్వకల్లు వద్ద వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడే హై కోర్ట్ శాశ్వతంగా ఏర్పాటు చేయనున్నారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. శాశ్వత భవనాలను నిర్మించేవరకు తాత్కాలిక హైకోర్ట్ కోసం అందుబాటులో ఉన్న భవనాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా కర్నూలు నగరంలోని ఏపిఎస్పీ, క్యాంపు లోని పోలీస్ క్వాటర్స్, డోన్ హై వేలో ఖాళీగా ఉన్న ఓ ప్రయివేట్ కాలేజీ, అదే విధంగా మునగాలపాడులోని గత కొద్ది నెలలుగా ఖాళీగా ఉన్న బాలసాయి సెంట్రల్ స్కూల్ బిల్డింగ్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. హైకోర్టు ఏర్పాటుతో జిల్లాలో రియల్ ఎస్టేట్ బూమ్ కూడా పుంజుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story