ప్రజాప్రతినిధుల అనర్హతను నిర్ణయించేందుకు స్వతంత్ర-శాశ్వత వ్యవస్థ ఉండాలి: సుప్రీంకోర్టు
పార్టీ ఫిరాయింపులపై సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ నిర్ణయాధికారంపై పార్లమెంట్ పునరాలోచించాలని సూచించింది. స్పీకర్ కూడా ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తే కదా అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రజాప్రతినిధుల అనర్హ తపై నిర్ణయాధికారం ఎవరికి ఉండాలనే అంశాన్ని పరిశీలించాలని కోరింది. దీనికోసం స్వతంత్ర-శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పేర్కొంది.
మణిపూర్ మంత్రి శ్యామ్‌కుమార్‌పై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శ్యామ్‌కుమార్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. ఫలితాల తర్వాత బీజేపీలో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై మండి పడిన కాంగ్రెస్ నాయకత్వం, సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. శ్యామ్ కుమార్ అనర్హత పిటిషన్‌పై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. గడువు లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ సుప్రీంకోర్టుకు రావొచ్చని వెసులుబాటు కల్పించింది. ఈ సందర్భంగా స్పీకర్ విచక్షణాధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏదో ఒక పార్టీ నుంచి ఎన్నికై, స్పీకర్ స్థానంలో ఉన్నవారు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవచ్చా లేదా అన్న అంశాన్ని పార్లమెంట్ పున: పరిశీలించాలని సూచించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com