ఆంధ్రప్రదేశ్

మూడు రాజధానులపై ప్రభుత్వ వ్యూహం ఇదేనా?

మూడు రాజధానులపై ప్రభుత్వ వ్యూహం ఇదేనా?
X

మూడు రాజధానుల బిల్లుకు మండలి షాక్‌ ఇచ్చింది. సర్కార్‌ వ్యూహాన్ని టీడీపీ అద్భుతంగా తిప్పి కొట్టింది. దీంతో మరి ఇప్పుడు ఏం జరుగుతుంది. ఇప్పటికే మండలి పరిణమాలాను జీర్ణించుకోలేకపోతున్న ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది? సెలక్ట్ కమిటీ ఎన్ని రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తుంది? ఈ సందేహాలు అందరిలో ఉత్కంఠ రేపుతున్నాయి.

అదే సమయంలో.. అధికార వైసీపీ ప్రతివ్యూహంపై దృష్టి సారించింది. మండలి రద్దు దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్‌ జారీ చేసైనా రాజధానిని కదిలించి తీరాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. ఆర్డినెన్స్‌ కూడా అక్కర్లేదని, సోమవారం శాసనసభలో చేసిన పాలన వికేంద్రీకరణ - ప్రాంతాల అభివృద్ధి తీర్మానం ఆధారంగా ముందుకెళ్లాలని కూడా ప్రభుత్వంభావిస్తున్నట్లు తెలిసింది. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేసి శాఖల ప్రధానకార్యాలయాలను విశాఖకు తరలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎంచుకునే మార్గంపై గురువారం స్పష్టత వచ్చే అవకాశముంది.

సెలక్ట్ కమిటీ నిర్ణయం వచ్చేంత వరకు వేచి ఉండకుండా తమ నిర్ణయాన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తే ఆర్డినెన్సు జారీ చేయవచ్చు. ఆర్డినెన్సు జారీ చేయడానికి ముందు.. చట్టసభల్ని ప్రొరోగ్ చేయాలి. ఆ తర్వాత గవర్నరు ఆమోదంతో ఆర్డినెన్సు జారీ చేయాలి. మండలి రద్దు చేయాలంటే సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. మండలిని రద్దు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ మంత్రి మండలి తీర్మానం చేయాలి. దానిని శాసనసభ ఆమోదంతో కేంద్రానికి పంపించాలి. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తే పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టం చేస్తుంది. కేంద్ర చట్టం ద్వారా మాత్రమే శాసన మండలిని రద్దు చేయగలరు. ఈ ప్రక్రియంతా ముగిసే సరికి కనీసం ఏడాది సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవన్నీ అసాధ్యం అనుకుంటే బిల్లును సెలెక్ట్‌ కమిటీ ఆమోదించే వరకు ఎదురు చూడాలి. కమిటీ ఛైర్మన్ ను, సభ్యుల్ని నియమించడంతో పాటు, కాలపరిమితి, విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉంటుంది. వీటిపై మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకుంటారు. కమిటీ ఛైర్మన్ గా సంబంధిత మంత్రి ఉంటారు. కమిటీలో 15 మంది వరకు సభ్యులుంటారు. ఇది శాసన మండలికి సంబంధించిన సెలక్ట్ కమిటీ కాబట్టి.. కమిటీలో సభ్యులంతా మండలి నుంచే ఉంటారు. మండలిలో పార్టీల బలాబలాల ఆధారంగా కమిటీలో ప్రాతినిధ్యం ఉంటుంది. శాసన మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్యే ఎక్కువ కాబట్టి, కమిటీలో మెజారిటీ సభ్యులు ఆ పార్టీ నుంచే ఉంటారు. కమిటీ ఆ బిల్లులను పరిశీలించి నివేదిక అందజేయడానికి కనీసం 3 నెలల సమయం తీసుకోవచ్చని శాసన మండలిలో టీడీపీపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. అవసరమైతే ఆ సమయం మరింత పొడిగించుకునే అవకాశమూ ఉంటుందని చెప్పారు.

Next Story

RELATED STORIES