ఒక సమాధానం ఆమెను కోటీశ్వరురాలిని చేసింది

అనుకున్నది సాధించాలి అనే కసి ఉండాలే కానీ ఎంత కష్టమైన పనినైనా ఇట్టే చేసి చూపించవచ్చు. పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదు అనే నానుడి మరోసారి రుజువైంది. తెలివితేటలు, ఏకాగ్రత ముందు శారీరక లోపం చిన్నబోయింది. తన కాళ్ళమీద తాను నిలబడాలి అనే సంకల్పం ఆమెను కోటీశ్వరురాలిని చేసింది. ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' అనే రియాలిటీ షో ను స్ఫూర్తిగా తీసుకొని తమిళంలో కోటీశ్వరి పేరుతో నటి రాధిక నిర్వహిస్తున్నారు. తాజాగా ముగిసిన ఓ ఎపిసోడ్ లో కౌసల్య కార్తీక అనే దివ్యాంగురాలు పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ లో ఆమె కోటి రూపాయలు గెలుచుకున్నారు.
'1948 లో ప్రచురించిన ఏ నవలలో పులకేశి-2 రాజు.. తమ్ముడు నాగ నంది గురించి ప్రస్తావించారు?' అనే కోటి రూపాయల ప్రశ్నకు సమాధానంగా 'శివగామియిన్ సబాతామ్' అని సమాధానమిచ్చారు. దాంతో రూ. కోటి ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్బంగా తన కలను సాకారం చేసుకోవడానికి అవకాశం కల్పించిన 'కోటీశ్వరి' ప్రోగ్రాం కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నటి రాధిక వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ ఎపిసోడ్ లో హాట్ సీట్ లో కూర్చోవడం ఆనందంగా ఉందని అన్నారు. 'నేను విజేతను అయ్యాయని ఈ ప్రపంచానికి గర్వాంగా చెబుతున్నాను' అని ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
దివ్యాంగురాలైనా చిన్నప్పటినుంచి తన కాళ్ళ మీద తాను నిలబడాలనే కోరిక ఉండేదని.. ఇప్పుడు అది తీరిందని అన్నారు. త్వరలో ఇష్టమైన స్విజ్జర్లాండ్ ప్రాంతాన్ని చూడటానికి వెళతానని ఆమె అన్నారు. అంతేకాదు ఈ ప్రైజ్ మని ద్వారా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికీ తన వంతు సహాయం చేస్తానని అన్నారు. తాను విద్యనభ్యసించిన నాగర్కోయిల్ లోని దివ్యాంగుల పాఠశాలకు కూడా సహాయం అందిస్తానని చెప్పారామె.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com