ప్రజలకు, రైతులకు మాట ఇస్తున్నాం.. రాజధాని అమరావతే : పవన్ కళ్యాణ్
వారంలో రెండోసారి ఢిల్లీ వెళ్లారు పవన్ కళ్యాణ్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో జనసేన-బీజేపీ నేతల బృందం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, రాజధానితో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధాని అమరావతే అంటూ గంటాపథంగా చెప్పారు పవన్ కళ్యాణ్. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు, రైతులకు మాట ఇస్తున్నాం అన్నారాయన. విశాఖలో గణతంత్ర దినోత్సవం నిర్వహణకే ప్రభుత్వం నానా ఇబ్బందులు పడుతోందని గుర్తుచేశారు జనసేనాని.
కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు, ఆమోదంతోనే అన్నీ చేస్తున్నామని వైసీపీ నేతలు చెప్తున్నారని, అంతా అబద్ధమని జనసేన-బీజేపీ నేతలు చెప్తున్నారు. మూడు రాజధానులకు కేంద్ర సమ్మతం లేదని పవన్ కుండబద్ధలు కొట్టి చెప్పారు.
వైసీపీ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనాారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర నిధులనూ వినియోగించుకోవడం లేదని విమర్శించారు. వాడుకున్న నిధులకు సరైన లెక్కలు చూపించడం లేదని ఆరోపించారు. రాజధాని రైతులు, మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్‌ను బీజేపీ, జనసేన నేతలు ఖండించారు. విచక్షణారహితంగా గాయపరిచారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మార్చుకోవాలని సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com