సీఏఏ అంశంలో విపక్షాలకు బిగ్ షాక్.. స్టే ఇవ్వడానికి అంగీకరించని సుప్రీం కోర్టు
పౌరసత్వ సవరణ చట్టంపై మోదీ సర్కారుకు బిగ్ రిలీఫ్ లభించింది. పౌరచట్టంపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. CAA ప్రక్రియను నిలిపివేయడానికి కూడా సుప్రీంకోర్టు ఒప్పు కోలేదు. ఈ చట్టంపై కేంద్రప్రభుత్వం 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అప్పటిలోపు హైకోర్టులు ఎలాంటి విచారణలు చేపట్టవద్దని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అంశంపై 5 వారాల తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది. అసోం, త్రిపురకు సంబంధించిన పిటిషన్లను మాత్రం వేరుగా విచారిస్తామని వెల్లడించింది. పిటిషన్లపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, M.I.M, వామపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ముస్లిం వర్గాలు, ఇతర స్వచ్చంద సంస్థలు కూడా పిటిషన్లు వేశాయి. చట్టం రాజ్యాంగబద్దతను పిటిషనర్లు ప్రశ్నించారు. చట్టానికి అనుకూలంగా కూడా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 143 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. సీఏఏపై దాఖలైన పిటిషన్లలో తమకు 60 పిటిషన్ల కాపీలు మాత్రమే అందాయని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకున్నారు. సీఏఏకు సంబంధించిన అన్ని ప్రక్రియలను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సిబల్ వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం, కేంద్రం స్పందన లేకుండా సీఏఏపై ఎలాంటి స్టే విధించలేమని స్పష్టం చేసింది. కొత్త పిటిషన్లపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
ఇక, సీఏఏపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కిక్కిరిసిపోయింది. 143 పిటిషన్లకు సంబంధించిన పిటిషనర్లు, వారి తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి వచ్చారు. ఎక్కువమంది ఒకేసారి రావడంతో స్వల్పంగా తోపులాట జరిగింది. కోర్టు గదిలోకి రావడానికి పిటిషనర్లు, లాయర్లు తోసుకున్నారు. దీంతో చీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు. సమూహాన్ని కంట్రోల్ చేయాలంటూ సుప్రీంకోర్టు భద్రతా సిబ్బందిని ఆదేశించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com