అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై నమోదైన మొదటి కేసు

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై నమోదైన మొదటి కేసు

అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందిని వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తోంది. రాజధాని నోటిఫికేషన్ రాకముందే అక్కడ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారన్నది వారి ప్రధాన వాదన. దీనిపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీలో కూడా ప్రకటించారు. అటు ఇదే సమయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై తొలి కేసు నమోదైంది. తనను మభ్యపెట్టి భూమి కొన్నారని.. వెంకటాయపాలెం దళిత మహిళ పోతురాజు బుజ్జి ఫిర్యాదు చేసింది. దీంతో 420, 506, 120బి, ఐపీసీ సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేసినట్లు సీఐడీ ప్రకటించింది.

సీఐడీ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు సీఐడీ ఎస్పీ మేరీ. 797 తెల్లరేషన్‌కార్డు దారులు వందలాది ఎకరాల భూములు కొన్నట్టు నిర్ధారించామన్నారు. ఎకరానికి 3 కోట్ల చొప్పున 220 కోట్లతో అమరావతి, పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లిలో స్థలాలు కొనుగోలు చేసినట్లు గుర్తించామని చెప్పారు. తెల్లరేషన్ కార్డు దారులతో భూములు కొనుగోలు చేయించిన వారిపై ఆరా తీస్తున్నామని.. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐడీ ఎస్పీ తెలిపారు. విచారణ వేగవంతం చేస్తామని, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా పెడతామని స్పష్టం చేశారు. 01

ఎలాంటి తప్పు చేయకపోయినా తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ప్రభుత్వం, అధికారులపై కోర్టుకు వెళ్తామని, పరువునష్టం దావా కూడా వేస్తామని స్పష్టం చేశారు.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఇప్పటికే వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భూములు కొన్నవాళ్ల పేర్లను కూడా అసెంబ్లీలో చదివి వినిపించింది ప్రభుత్వం. అటు విచారణ జరిపించండి అని ఇప్పటికే సవాల్ విసిరింది టీడీపీ. ఈ నేపథ్యంలోనే తొలి కేసు నమోదుకావడంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్‌ పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story